BRS and AAP MPs Boycotts Parliament Sessions: అదానీ వ్యవహారంపై చర్చ జరిపించాలని డిమాండ్ చేస్తూ... బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు వద్ద ఆందోళనకు దిగారు. వరుసగా రెండో రోజు ఆప్ సభ్యులతో కలిసి పార్లమెంటు సమావేశాలను బహిష్కరించారు. అదానీ సంస్థల వ్యవహారంపై చర్చించాలంటూ లోక్‌సభ, రాజ్యసభల్లో నోటీసులు ఇస్తూ వస్తున్న బీఆర్ఎస్..... సభాపతులు చర్చను అనుమతించకపోవటంతో నిరసన బాట పడుతున్నారు.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ.... పార్లమెంటు ఆవరణలో బీఆర్ఎస్, ఆప్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కేకే, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావుతో కలిసి ఎంపీలు సురేశ్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, మాలోత్ కవిత, బీబీ పాటిల్ సహా మిగతా ఎంపీలంతా నిరసన వ్యక్తం చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ లేదంటే సీజేఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం స్పందించకపోవడంతో సభను బహిష్కరిస్తున్నట్లు ఎంపీలు వెల్లడించారు.
BRS MPs boycotts President speech in parliament : బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో చేసిన వైఫల్యాలకు నిరసనగానే తాము ఈ ప్రసంగాన్ని బహిష్కరించినట్లు బీఆర్ఎస్ ఎంపీలు ప్రకటించారు. తెలంగాణ, దిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారాయన్న బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు.. వీటిని దేశ ప్రజల ముందు పెట్టేందుకే తామీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.