Police Sloved Boy Kidnapping Case In Malkajigiri : మల్కాజిగిరిలో 15వ తేదీన ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడు కనిపించకుండా పోయాడు. చీకటి పడినా ఇంకా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడికిడ్నాప్ కథను సుఖాంతం చేశారు. ఈ మేరకు డీసీపీ ధరావత్ జానకి సమావేశం నిర్వహించి.. కేసును ఛేదించిన విధానాన్ని వివరించారు.
హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్న స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస్ కుమారుడు హర్షవర్ధన్‌ను శివ అనే నిందితుడు అపహరించడానికి పథకం రచించాడు. దీని కోసం శివ తన సోదరుడు రవి, స్నేహితులు మహిపాల్, దిలీప్ సాయం తీసుకున్నాడు. దాదాపు నెల రోజుల నుంచి ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. చివరకు ఈనెల 15వ తేదీన ఆడుకుంటూ ఉండగా మాయమాటలు చెప్పి కారులో అపహరించుకుపోయారు.
Boy Kidnapping Case In Malkajigiri : సప్తగిరి కాలనీ నుంచి బయలుదేరిన కారు తార్నాక్ సమీపంలో బాల నేరస్థుడిని దించేసి.. నిందితులు 13 ఏళ్ల బాలుడిని మాత్రం తమ వెంట తీసుకెళ్లారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా ఫోన్ చేసి.. రూ.2 కోట్లను డిమాండ్ చేశారు. ఈ విషయం పోలీసులకు చెబితే బాలుడిని చంపేస్తామని బెదిరించారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ప్లే స్టోర్ నుంచి పలు అఫ్లికేషన్లు డౌన్లోడ్ చేసుకొని.. అంతర్జాతీయ ఫోన్ కాల్స్‌లా వారిని నమ్మించి భయపెట్టారు. అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సీసీ కెమెరాలు, నిందితులు ఉపయోగించిన కారు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించామని డీసీపీ చెప్పారు.