తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు కలిసొచ్చిన మినుము పంట.. మద్దతుధర కన్నా ఎక్కువున్నా కొనాలన్న కేంద్రం!

Black Gram Cultivation: దేశంలోని పప్పు కొరత.. రాష్ట్ర రైతులకు కలిసొచ్చింది. తొలిసారి మద్దతుధర కన్నా ఎక్కువున్నా మినపప్పు పంటను కొనాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుత యాసంగిలో మినుము పంట వేస్తే ఆదాయం గ్యారంటీ అని.. దాని సాగు చేసే దిశగా రైతులను ప్రోత్సాహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ జిల్లా స్థాయి అధికారులకు సూచించింది.

By

Published : Dec 21, 2021, 9:36 AM IST

Black Gram Cultivation, Black Gram demand
మినుము పంట

Black Gram Cultivation: దేశవ్యాప్తంగా కొరత నేపథ్యంలో మినప్పప్పు ధరలు మండిపోతున్నాయి. కిలో రూ.120 నుంచి 140 దాకా అమ్ముతున్నారు. ఇదే కొరత రాష్ట్ర రైతులకు కలసివచ్చింది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటల కొనుగోలుపై కేంద్రం తాజాగా స్పష్టత ఇచ్చింది. మినుమును మద్దతుధరకే కాకుండా అంతకన్నా ఎక్కువున్నా బహిరంగ మార్కెట్‌లో కొనాలని స్పష్టం చేసింది. ఇలాంటి పరిణామం గత కొన్నేళ్లుగా చూడలేదు. ఈ క్రమంలో మినుము సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ తాజాగా జిల్లాస్థాయి అధికారులకు సూచించింది. ప్రస్తుత సీజన్‌లో ఈ పంట సాధారణ విస్తీర్ణం 24,018 ఎకరాలు కాగా ఇప్పటికే 58వేల ఎకరాల్లో వేశారు. మొత్తం నూనెగింజలు, పప్పుధాన్యాల పంటల్లో ఇలా అధిక విస్తీర్ణంలో సాగైంది ఇదొక్కటే. వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు సాగుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు రైతులకు సూచించింది. వ్యవసాయశాఖ కూడా పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. కానీ, ఈ పంటలు వేస్తే మద్దతు ధరకు కొంటారా అని రైతులు క్షేత్రస్థాయి వ్యవసాయాధికారులను అడుగుతున్నారు. దీనిపై కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

25 శాతంపైనా హామీ ఏదీ..!

సాధారణంగా ఏటా పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల్లో రాష్ట్ర దిగుబడిలో 25 శాతం మాత్రమే మద్దతు ధరకు కొనడానికి కేంద్రం అనుమతిస్తోంది. ఈ సీజన్‌లో ఆ హామీ కూడా ఇంకా ఇవ్వలేదు. వరితోపాటు ఏ పంట ఎంత కొంటారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయశాఖను అడిగింది. యాసంగి(రబీ) పంటలు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి మార్కెట్లకు రావడం మొదలవుతుందని అప్పటికి వచ్చే దిగుబడుల అంచనాలను బట్టే ఎంత కొంటామో చెప్పగలమని కేంద్ర వ్యవసాయశాఖ వర్గాలు రాష్ట్రానికి తెలిపాయి. ఒక్కో రాష్ట్రానికి విడిగా ఎంత కొంటామనేది చెప్పలేమని వివరించాయి. దీంతో ఏ పంటను ఎంత కొంటామనేది రాష్ట్ర ప్రభుత్వమూ ఇంతవరకూ ప్రకటించలేదు.

మినుముల దిగుబడి అయిదేళ్లుగా దేశంలో పడిపోతూ వస్తున్నందున మార్కెట్‌లో మద్దతుధర కన్నా ఎక్కువున్నా సరే.. అదే ధరకు రైతుల నుంచి నేరుగా కొని నిల్వలు పెట్టి వ్యాపారులను, పప్పు ధరలను నియంత్రించాలని ఈ సీజన్‌లో నిర్ణయించింది. 2016 వానాకాలం(జూన్‌ నుంచి సెప్టెంబరు) సీజన్‌లో దేశవ్యాప్తంగా 21.80 లక్షల టన్నుల మినుముల దిగుబడి రాగా ఈ ఏడాది(2021) 20.50 లక్షల టన్నులే వచ్చింది. తెలంగాణలోనూ ఈ ఏడాది వానాకాలంలో 66వేల ఎకరాల సాధారణ విస్తీర్ణానికి 47,469 ఎకరాల్లోనే మినుము సాగైంది. ఈ యాసంగిలోనే కొంత పెరిగినందున రైతులకు మార్కెట్‌ ధర ఇచ్చి కొంటామని ఎంత విస్తీర్ణంలోనైనా వేయాలని వ్యవసాయశాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి చెప్పారు. వానాకాలంలో వరి పంట కోశాక పప్పుధాన్యాలు, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి నూనెగింజల పంటలతో సాగుమార్పిడి చేస్తే అధిక ఆదాయం వస్తుందని రైతులకు ఆయన సూచించారు.

ఇదీ చూడండి:Alternative Crops: మినుము వైపు మొగ్గు.. ఏకంగా 58 ఎకరాల్లో సాగు

ABOUT THE AUTHOR

...view details