వీరి చేరికతో వారికి బలమే... పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడటం, రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలుపొందడం వల్ల తెలంగాణలోనూ ఆ పార్టీ పట్ల సానుకూల వాతావరణ పెరిగిందని కమలనాథులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భాజపాలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఈ పరిణామాలతో రాష్ట్ర నాయకత్వం ఉత్సాహాంతో ఉంది.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంపై పట్టు
మాజీ ఎంపీ వివేక్ ఇటీవలే భాజపాలో చేరారు. ఆయనకు ఉన్న పత్రిక, టీవీ ఛానల్‌తో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని కమలనాథులు భావిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం మీద పట్టు ఉండటం.. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మంచిర్యాల కార్పొరేషన్, రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి నగరపాలక సంస్థ, బెల్లంపల్లి మున్సిపాలిటీపై ప్రభావం చూపుతుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
అనుభవం
రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున్న తెదేపా నేతలు భాజపాలో చేరారు. సభలు, సమావేశాల నిర్వహణలో అనుభవం ఎక్కవగా ఉండటంతో పాటు పోల్ మేనేజ్ మెంట్లో కూడా గరికపాటి దిట్ట అనే ప్రచారం ఉంది. కమలదళంలో చేరిన తెరాస నేత సోమారపు సత్యనారాయణ వల్ల కూడా కోల్ బెల్ట్ ఏరియాలో పార్టీ పటిష్ఠమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మోత్కుపల్లి చేరికతో ఎస్సీ వర్గాల్లో కూడా బలం పెరగనుంది.
బీసీలు కూడా
త్వరలోనే కమలం గూటికి చేరనున్న దేవేందర్ గౌడ్ వల్ల కూడా బీసీలంతా భాజపా వైపే ఉంటారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో బలమైన నేతగా ఉన్న దేవేందర్ గౌడ్ హోంమంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు తెదేపాలో రెండో స్థానంలో కొనసాగారు. మోత్కుపల్లి నరసింహులు, దేవేందర్ గౌడ్, వీరేందర్‌గౌడ్, రేవూరిప్రకాశ్ రెడ్డితో పాటు పలువురు ముఖ్యనేతలు అమిత్ షా సమక్షంలో త్వరలోనే కమలం గూటి చేరనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి.. మంచి మనసున్న మలయాళ మెగాస్టార్