తెలంగాణలో అధికారంలోకి రావాలని పథకాలు రచిస్తోన్న భాజపా.. తమ పార్టీ బలోపేతానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రానికి సారధిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసింది. హేమాహేమీలను కాదని సంజయ్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది.
విద్యార్థి దశ నుంచే
కరీంనగర్ ఎంపీగా ఉన్న సంజయ్.. విద్యార్థి దశ నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌లో క్రియాశీలకంగా పనిచేశారు. విద్యార్థి సంఘం ఏబీవీపీ, యువమోర్చా లాంటి సంఘాల్లో చురుకుగా వ్యవహరించారు. పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్న సంజయ్... తెరాస ముఖ్యనేత, సిట్టింగ్ ఎంపీ అయిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ను ఓడించి అందరి దృష్టి ఆకర్షించారు.
యువరక్తం వైపే..
పార్టీ రాష్ట్ర సారధి కోసం కమల దళం తీవ్ర కసరత్తు చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, అప్పటి అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిలను కాదని సంజయ్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం రావాలన్నా.. తెరాసను సమర్థంగా ఎదుర్కోవాలన్నా.. యువరక్తాన్ని తీసుకురావాలని జాతీయ నాయకత్వం భావించింది. పార్టీ అధ్యక్ష పదవిని హైదరాబాద్ నేతలకే కట్టబెడతారన్న అపవాదు పోవాలంటే గ్రామీణ ప్రాంత నేతకే పగ్గాలు అప్పగించాలని దృఢ నిశ్చయానికి వచ్చింది. ఆర్ఎస్ఎస్ మద్దతుతో పాటు అమిత్‌షా, నడ్డాలు సంజయ్‌కే జై కొట్టారు.