నిజమైన ఉద్యమకారులు ఉన్న పార్టీ భాజపా మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. మలిదశ ఉద్యమం చేపట్టి తెలంగాణ ఆకాంక్షలను నెరవేరుస్తామని తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని నాగోల్ తట్టి అన్నారం జె కన్వెన్షన్‌లో భాజపా అధ్వర్యంలో నిర్వహించిన ''అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్షల సాధన సభ''లో సంజయ్ మాట్లాడారు.
కొంతమంది మూర్ఖులు తెలంగాణ చరిత్రను రూపుమాపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలా పదవుల కోసమే ఉద్యమ ద్రోహులు చేస్తున్నారని విమర్శించారు. వాస్తవ చరిత్రను తెలిపేందుకు ఈ సభను ఏర్పాటు చేసినట్లుగా బండి సంజయ్ పేర్కొన్నారు. మూర్ఖపు ముఖ్యమంత్రిని, తెరాసను బంగాళాఖాతంలో కలపాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ''తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించాం..'' అని ప్రజలు బాధపడుతున్నారంటే కేసీఆర్ నిరంకుశపాలనే కారణమన్నారు. రాష్ట్రంలో కొత్త తరహా ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.