TARUN CHUGH: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కెంది. దీంతో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఈ నెల 12న హైదరాబాద్‌కు రానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సంగ్రామ యాత్ర సాగుతున్న తీరు.. మునుగోడు ఉప ఎన్నికపై పార్టీ నాయకత్వంతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యాచరణను రూపొందించనున్నారు. తెరాస, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు తరుణ్ చుగ్ సమక్షంలో భాజపాలో చేరనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి.
ఎల్లుండి దిల్లీ వెళ్లనున్నబండి సంజయ్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎల్లుండి ఉదయం దిల్లీ వెళ్లనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న బండి ఆ ఒక్క రోజు పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. తిరిగి మరుసటి రోజు నుంచి పాదయాత్రను కొనసాగించనున్నారు.
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర: రాష్ట్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. గొల్లగూడెం, ముగ్దుమ్‌పల్లి, గుర్రాలదండి, బట్టుగూడెం గ్రామాల మీదుగా 11.7 కి.మీ.మేర నేడు పాదయాత్ర సాగనుంది. రాష్ట్రంలో రానున్నది భాజపా ప్రభుత్వమేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికల్లో రెండు గెలిచామని బండి సంజయ్ గుర్తు చేశారు. మునుగోడు ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఎన్నికలని వ్యాఖ్యానించారు.
తమతో 10, 12 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని .. రాష్ట్రంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బండి పేర్కొన్నారు. తెరాస నాయకులే ఉప ఎన్నికలకు కారణం కాబోతున్నారని అన్నారు. పార్టీలో చేరేవారికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. టికెట్ల విషయంలో ఎవరికీ హామీ ఉండదని చెప్పారు. పార్టీ నిర్ణయమే ఫైనల్‌ని తెలిపారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా సందర్భాల్లో మోదీ పథకాలను ప్రశంసించారని ఆయన అన్నారు.