Laxman Fire on TRS: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘటనపై జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని భాజపా ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ ఘటనను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళతామన్నారు. బండి సంజయ్ అరెస్ట్‌పై లోక్‌సభ స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. గ్యాస్ కట్టర్, రాడ్లతో భాజపా క్యాంప్ కార్యాలయ తలుపులు, కిటికీలు పగులగొట్టి బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారని తెలిపారు.
స్వయంగా పోలీస్ కమిషనర్ సత్యనారాయణ... తలుపులు పగులగొట్టారని లక్ష్మణ్ ఆరోపించారు. బండి సంజయ్‌పై అక్రమ కేసులు బనాయించి 14 రోజులు రిమాండ్ విధించారని మండిపడ్డారు. తెరాస... ప్రభుత్వ పతనం ప్రారంభమైందని ధ్వజమెత్తారు. రోజురోజుకు తెలంగాణలో భాజపా బలోపేతమవుతుందని... అందుకే ఇలాంటి అణిచివేత కార్యక్రమాలు ప్రభుత్వం పూనుకుందన్నారు.
ఉద్యోగులు, నిరుద్యోగుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని పేర్కొన్న లక్ష్మణ్... స్థానిక ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రపతి ఉత్తర్వులను... రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. కొవిడ్ రూల్స్‌కు అనుగుణంగానే బండి సంజయ్ జాగరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. సంజయ్‌కు సంఘీభావం తెలుపుదామని నాయకులు వెళితే.. మధ్యలోనే పోలీసులు అరెస్ట్ చేశారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.