BJP National Leaders Campaigning in Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ అగ్రనేతలు హోరెత్తిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నడ్డా, అమిత్ షా, యోగీ ఆదిత్యనాథ్ సుడిగాలి పర్యటన చేస్తూ బీజేపీ అభ్యర్థుల తరపున సభలు, రోడ్ షోల్లో పాల్గొన్నారు. మూడు రోజుల పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిరోజు సుడిగాలి పర్యటన చేశారు. కామారెడ్డి, మహేశ్వరంలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రధాని.. కాంగ్రెస్, బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేత, ఉచిత రామమందిరం దర్శనం, బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణకు చట్ట బద్ధత అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. మొదటి రోజు పర్యటన ముగించుకున్న మోదీ రాత్రి రాజ్ భవన్‌లో బస చేశారు.
ఈ ఎన్నికల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే - సీఎం అయ్యేది బీసీ వ్యక్తినే : ప్రధాని మోదీ
BJP Campaign in Telangana 2023 : హైదరాబాద్ పటాన్‌చెరులో బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్‌కు మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్, ఎమ్ఐఎమ్లో ఎవరికి ఓటేసినా బీఆర్ఎస్కే వెళ్తుందని షా ఆరోపించారు. హైదరాబాద్ ముషీరాబాద్ బీజేపీఅభ్యర్థి పూసరాజుకు మద్దతుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కవాడిగూడలో రోడ్‌షో నిర్వహించారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణికి మద్దతుగా నడ్డా నిర్వహించిన రోడ్‌షో.. చిలకలగూడ నుంచి సీతాఫల్‌మండి మీదుగా వారసిగూడ వరకు కొనసాగింది.
కుత్బుల్లాపూర్‌లో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌కు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ నిజాంపేట్‌లో రోడ్ షో నిర్వహించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో జనసేన అభ్యర్థి నేమూరి శంకర్‌గౌడ్‌కు మద్దతుగా నిర్వహించిన సభలో పవన్ ప్రసంగించారు. తెలంగాణ కోసం నిత్యం ఆలోచించే మోదీ నాయకత్వంలో బీసీ ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అవినీతిరహిత పాలనను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
నిజామాబాద్‌లో ధన్‌పాల్ సూర్యనారాయణకు మద్దతుగా బీజేపీ ఎన్నికల కార్నర్ మీటింగ్‌లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ బీజేపీ అభ్యర్థి దినేష్ కులాచారిని గెలిపించాలంటూ డిచిపల్లిలో మంద కృష్ణ ప్రచారం చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో కోరుట్ల బీజేపీ అభ్యర్థి, ఎంపీ అర్వింద్‌తో కలిసి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భూపాలపల్లిలో బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి నిర్వహించిన విజయ సంకల్ప సభకు హాజరైన మందకృష్ణ.. తమ వర్గం కోసం కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లిలో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు రోడ్ షో నిర్వహించారు.