MP Laxman Fires on KCR : బీఆర్ఎస్ పార్టీ కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టే సమయం, ధనం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఉంది కానీ.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునే మనసు మాత్రం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రైతులు బాధపడుతుంటే సీఎం, మంత్రులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుల సమస్యలపై సమీక్ష చేసే సమయం సీఎంకు లేదా అని ప్రశ్నించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న తెలంగాణ సర్కార్.. రైతు బాంధవుడు అని ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో కర్షకులకు భద్రత, భరోసా కల్పించలేకపోతున్నారని ధ్వజమెత్తారు.
"తెలంగాణ రాష్ట్రంలో పాలన పడకేసింది. పక్తు రాజకీయాలపైన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వాళ్ల హక్కుల కోసం పోరాడుతున్నారు. బెదిరింపులతో వారి సమ్మెను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుంచి తీసివేస్తామని బెదిరిస్తున్నారు. 5 వేలకు పైగా వీఆర్వోలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తే వీఆర్వో వ్యవస్థనే రద్దు చేశారు. ఆర్టీసీ సమ్మెపైనా ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది." - కె. లక్ష్మణ్, బీజేపీ ఎంపీ
MP Laxman Fires on KCR Over JPS Issue : అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎంపీ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి సమీక్ష చేసే తీరికలేకపోవడం చూస్తోంటే.. రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ది అర్ధమవుతుందని మండిపడ్డారు. రైతులు పంట నష్టపోయి ఇబ్బందులు పడుతుంటే.. 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అంటా కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. సొంత రాష్ట్రంలో రైతుల బతుకులు బాగు చేయలేని ముఖ్యమంత్రి దేశంలో అన్నదాతలకు ఏం మేలు చేస్తారని నిలదీశారు. ప్రచారం కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టేందుకు బీఆర్ఎస్ సర్కారు సిద్దంగా ఉంది తప్పితే.. రైతుల కోసం 3 వందల కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
విశ్వనగరంగా వెలుగొందుతున్న హైదరాబాద్ మహానగరంలో ఉగ్రవాదం తిష్టవేసుకుని కూర్చుందని లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేయాలని కోరారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా.. దాని మూలాలు హైదరాబాద్‌తో ముడి పడి ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ భద్రతకే ముప్పని ఆవేదన చెందారు.
MP Laxman on Karnataka Exit polls : ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడిన లక్ష్మణ్.. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంపై స్పందించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాము ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మడం లేదని.. పీపుల్ పోల్స్‌ను మాత్రమే నమ్ముతామని స్పష్టం చేశారు. కన్నడ ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.