తెలంగాణ

telangana

By

Published : Dec 18, 2022, 2:13 PM IST

Updated : Dec 18, 2022, 4:45 PM IST

ETV Bharat / state

ఎన్నికల కమిషన్ కేసీఆర్ జేబు సంస్థ కాదు: కె.లక్ష్మణ్

MP Laxman on Jamili Elections : కర్ణాటకతో కలిసి ఎన్నికలు జరగాలని భారాసకు కోరిక ఉండవచ్చని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కేసీఆర్ జేబు సంస్థ కాదని విమర్శించారు. కిసాన్ సర్కారు అంటూ బయలుదేరిన భారాస అధినేత కేసీఆర్ మాటలు దేశ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. ప్రధాని మోదీ పదే పదే ప్రస్తావిస్తున్న జమిలి ఎన్నికలు పార్టీగా తాము కూడా కోరుకుంటున్నామని.. శాసనసభ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా భాజపా సిద్ధంగా ఉంటుందని ఆయన ప్రకటించారు.

ఎన్నికల కమిషన్ కేసీఆర్ జేబు సంస్థ కాదు: కె.లక్ష్మణ్
ఎన్నికల కమిషన్ కేసీఆర్ జేబు సంస్థ కాదు: కె.లక్ష్మణ్

ఎన్నికల కమిషన్ కేసీఆర్ జేబు సంస్థ కాదు: కె.లక్ష్మణ్

MP Laxman on Jamili Elections : ప్రధాని నరేంద్రమోదీ పదే పదే ప్రస్తావిస్తున్న జమిలి ఎన్నికలు పార్టీగా తాము కూడా కోరుకుంటున్నామని భాజపా ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. సాధారణంగా ఉప ఎన్నికలు, ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దు అనేది ప్రజా ధనం దుర్వినియోగం కాదని తేల్చి చెప్పారు. శాసనసభ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా భాజపా సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు. హైదరాబాద్‌ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది ఎన్నికల సంఘం పరిధిలోని అంశం అని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. కర్ణాటకతో కలిసి ఎన్నికలు జరగాలని భారాసకు కోరిక ఉండవచ్చు కానీ.. ఎన్నికల కమిషన్ కేసీఆర్ జేబు సంస్థ కాదని విమర్శించారు. కిసాన్ సర్కారు అంటూ బయలుదేరిన భారాస అధినేత కేసీఆర్ మాటలు దేశ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని ఆరోపించారు. అది పరివార్ సర్కారు.. అవినీతి, కుంభకోణాల ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతు రుణమాఫీ, ఉచిత రసాయన ఎరువుల సరఫరా లేదని ఆరోపించారు. కీలక వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు తీసుకుంటున్న అనేక సంస్కరణల నేపథ్యంలో అసలైన కిసాన్ సర్కారు మోదీ ప్రభుత్వమని నిరూపించుకుందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని నకిలీ విత్తనాలతో రైతుల జీవితాలు నాశనం చేస్తున్నారని లక్ష్మణ్‌ ఆక్షేపించారు. ఇదంతా దేశ ప్రజానీకం గమనిస్తోందని అన్నారు. గతంలో సారు.. కారు.. 16 అంటూ ఊదరగొట్టి దిల్లీలో చక్రం తిప్పుతానన్న కేసీఆర్.. కనీసం బొంగరం కూడా తిప్పలేపోయారని విమర్శించారు.

ప్రభుత్వ శాఖల్లో 3 లక్షల ఖాళీలు భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, వారానికోసారి ప్రకటన ఇస్తూ నిరుద్యోగ యువతను నిరాశ, నిస్పృహల్లోకి నెట్టేసిందని లక్ష్మణ్‌ ఆరోపించారు. అదే కేంద్రం ఒకేసారి 7 లక్షల వరకు ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని గుర్తు చేశారు. ఏదో చేస్తున్నామని చెప్పుకునేందుకు కొత్త మెట్రో రైలు ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చిన మంత్రి కేటీఆర్.. పాత బస్తీలో ఎంఐఎం మిత్రులకు తలొగ్గి కేవలం 6 కిలోమీటర్ల దూరం మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. దళితబంధు పథకం పేరు చెప్పి ఎస్సీ, ఎస్టీ సహకార సంస్థల ద్వారా రూ.వేల కోట్లు రుణాలు ఇవ్వకుండా సర్కారు మొండిచేయి చూపుతుందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు.

ప్రధాని నరేంద్రమోదీ పదే పదే ప్రస్తావిస్తున్న జమిలి ఎన్నికలు పార్టీగా మేము కూడా కోరుకుంటున్నాం. ముందస్తు ఎన్నికల పేరిట ఆ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ భ్రమల్లో పెట్టేస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేసుకునే అవకాశం తప్ప ఎన్నికలు అంశం కేసీఆర్ చేతిలో లేదు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా భాజపా సిద్ధంగా ఉంటుంది. కర్ణాటకతో కలిసి ఎన్నికలు జరగాలని భారాసకు కోరిక ఉండవచ్చు. కానీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది ఎన్నికల సంఘం పరిధిలోని అంశం. ఎన్నికల కమిషన్ కేసీఆర్ జేబు సంస్థ కాదు. - కె.లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు

ఇవీ చూడండి..

ఒక జాబ్ ఉంటే ఇయ్యమ్మా.. మెట్రో రైల్లో నిరుద్యోగుల భిక్షాటన

అసలేంటీ కొలీజియం? కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ ఎందుకు..?

Last Updated : Dec 18, 2022, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details