BJP MLAs on Congress Six Guarantees : కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాయాలని బీజేపీ డిమాండ్ చేసింది. విద్యుత్ శాఖ ప్రాజెక్టులపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని ప్రకటించిన కొద్ది సేపటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చూస్తే జాలేస్తోందని కాంగ్రెస్ సభ్యులు అన్నారని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అధికార పార్టీ నేతలకు ప్రారంభంలోనే బీఆర్‌ఎస్‌పై జాలి కలిగితే, ఇక విచారణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌పై తమకు అనుమానంగా ఉందన్నారు.
200 యూనిట్ల ఉచిత కరెంట్ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పండి : పాయల్ శంకర్
MLA Payal Shankar Fires on Congress : నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో పార్టీకి చెందిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కంటే ఒక సీటు తక్కువ ఉన్న ఎంఐఎం పార్టీకి శాసనసభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇచ్చారని పాయల్ శంకర్ మండిపడ్డారు. ఇదెక్కడి సంప్రదాయమని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిని కలిసి అడిగినట్లు చెప్పారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి. విద్యుత్ సంస్థల అప్పులపై సీబీఐ విచారణ జరిపించాలి. మోటార్లకు మీటర్ల విషయంలో బీఆర్‌ఎస్ నేతలు అబద్ధాలు చెప్పారు. మీటర్లు పెట్టడానికి, ఉచిత విద్యుత్‌కు సంబంధం లేదు. మోటార్లకు మీటర్లు పెట్టిన ఏపీలోనూ ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతోంది. - పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే