స్ట్రాంగ్ రూమ్‌లకు వెళ్లాల్సిన వీవీ ప్యాట్లు బయటకు ఎలా వచ్చాయని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) ప్రశ్నించారు. కేవలం డబ్బు ఉన్నవాళ్లే రాజకీయం చేసే పరిస్థితులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక(Huzurabad bypoll)లో వీవీ ప్యాట్ల తరలింపుపై.. హైదరాబాద్‌లో ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌కు పార్టీ నేతలు డీకే అరుణ, రాజా సింగ్, రామచందర్ రావు ఫిర్యాదు చేశారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. వీవీ ప్యాట్ల తరలింపుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ మేరకు డీకే అరుణ మీడియాతో మాట్లాడారు.
అధికారులదీ అదే తీరు
ప్రైవేట్ కారులో వీవీ ప్యాట్ల తరలింపుపై ఫిర్యాదు చేశామని డీకే అరుణ(DK Aruna) అన్నారు. వీవీ ప్యాట్లు తరలించే బస్సులను తెరాస నేత హోటల్ వద్ద ఆపారన్న ఆమె.. బస్సులోని వీవీ ప్యాట్ బాక్సును కారులో పెట్టారని ఆరోపించారు. భద్రత లేకుండా ఈవీఎంలను ఎందుకు తరలించారని ప్రశ్నించారు. అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు.