విద్యుత్ ఛార్జీల భారాన్ని నిరసిస్తూ మింట్ కాంపౌండ్ వద్ద ధర్నా నిర్వహించేందుకు బయలు దేరిన భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భాజపా సీనియర్ నేత డాక్టర్ కె.లక్ష్మణ్‌ను అశోక్ నగర్‌లోని ఆయన నివాసం వద్ద చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావును తార్నాకలోని ఆయన నివాసంలో హౌజ్ అరెస్ట్ చేశారు.
మరోవైపు పోలీసుల తీరును నేతలు ఖండించారు. శాంతి యుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని.. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి, 3 నెలల కరెంట్ బిల్లులు ఒకేసారి కట్టమనడం దారుణమన్నారు. ప్రజలను ఇంటి అద్దెలు కట్టొద్దని చెప్పిన సీఎం.. ఇప్పుడు విద్యుత్ బిల్లులు ఎందుకు వసూలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వెంటనే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.