BJP leader Jitender Reddy tweet : రాష్ట్ర బీజేపీలో సందిగ్ధ పరిస్థితులు నెలకొన్న వేళ.. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సొంత పార్టీ నేతల తీరును విమర్శిస్తూ చేసిన ట్వీట్ దుమారం రేపుతున్నాయి. వాహనంలోకి బలవంతంగా గేదెలు ఎక్కిస్తున్న వీడియోను పోస్టు చేసిన ఆయన.. రాష్ట్ర బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరమని ట్వీట్ చేశారు. జితేందర్‌రెడ్డి ట్వీట్ ఒక్కసారిగా దుమారం రేపగా ఈ ట్వీట్ దేనికి సంకేతమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్న సమయంలో వెంటనే డిలీట్ చేశారు.
ఈ క్రమంలోనే ఆయన మరో ట్వీట్ చేశారు. బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించే వారికి ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలో చెప్పే ప్రయత్నం చేశానని.. కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వివరణ ఇచ్చారు. జితేందర్‌రెడ్డి చేసిన ఈ ట్వీట్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. బీజేపీలో అంతర్గత కుమ్ములాటను అద్భుత పోలికతో ప్రజలకు వివరించారన్నారు. బీజేపీలో చేరిన వారి పరిస్థితి గురించి ఇంత కంటే గొప్పగా ఎవరూ చెప్పలేరంటూ రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
రాష్ట్ర బీజేపీలో పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతున్న వేళ.. జితేందర్‌రెడ్డి ట్వీట్ మరింత చర్చనీయంగా మారింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న కమలంలో.. నివురు గప్పిన నిప్పులా నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. బండి సంజయ్, ఈటల రాజేందర్.. రెండు వర్గాలుగా విడిపోవడం పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది.