Bandi Sanjay Reaction On Telangana Budget: శాసనసభలో ఇవాళ ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా డొల్ల.. ఎలక్షన్ స్టంట్‌ను తలపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బడ్జెట్లో అంతా శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలేనని ఆయన విమర్శించారు. ఆత్మస్తుతి పరనిందగా కేంద్రాన్ని తిట్టడం.. తప్ప అందులో ఏమీలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా అన్ని వర్గాలను పూర్తిగా వంచించేలా బడ్జెట్‌ను రూపొందించారని బండిసంజయ్ ఆరోపించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో, వివిధ సందర్భాల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటినీ చివరి ఏడాదైనా నెరవేరుస్తారని ఆశించిన ప్రజలకు ఈసారి కూడా మొండి చేయి చూపేలా బడ్జెట్ ఉందని ఆరోపించారు. బడ్జెట్లో కేటాయించిన నిధులకు, ఆచరణలో ఖర్చు చేస్తున్న నిధులకు పొంతనే లేదన్నారు. ప్రతిపాదిత బడ్జెట్లో 50 శాతం నిధులను కూడా ఖర్చు చేయని కేసీఆర్ ప్రభుత్వ తీరును చూస్తుంటే.. మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప దాటడం లేదనే సామెతకు అద్దం పడుతోందని ఆయన.. విమర్శించారు.
యావత్ దళిత సమాజాన్ని మోసం చేసేవిధంగా బడ్జెట్ ఉందని అభిప్రాయ పడ్డారు. గిరిజన బంధు అమలుకు ఏ మాత్రం చాలిచాలని నిధులు మంజూరు చేశారని మండిపడ్డారు. ఈసారి కూడా బీసీ విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కు కాబోతున్నట్లు బడ్జెట్ చూస్తుంటే అర్థమవుతోందని దుయ్యబట్టారు. విద్య, వైద్యరంగాలకు కేటాయింపులు చూస్తుంటే మధ్య తరగతి ప్రజలపై మరింత భారం మోపేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని తెలిపారు. డిస్కంలను మరింత సంక్షోభంలో నెట్టేలా కేటాయింపులు ఉన్నాయని విమర్శించారు.