ప్రధానమంత్రి నరేంద్రమోదీ 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో 70 మంది యువకులు రక్తదానం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి ప్రవేశపెట్టిన బిల్లును తెరాస ప్రభుత్వం తమ ఎంపీల ద్వారా అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోందని రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా సప్తాహ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ముషీరాబాద్‌లోని భాజపా క్యాంపు కార్యాలయంలో యువమోర్చా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం - రక్తదాన శిబిరం
ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా సప్తాహ కార్వక్రమంలో భాగంగా భాజపా యువమోర్చా నాయకులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 70 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ తెరాస ప్రభుత్వంపై మండిపడ్డారు.
రైతు ప్రభుత్వమని చెప్పుకునే తెరాస ప్రభుత్వం కేంద్రం ప్రవేశపెట్టే రైతు ప్రయోజనాల బిల్లును అడ్డుకోవడంతోనే ఆ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతోందన్నారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మారుస్తామన్న ఈ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తూ నరేంద్రమోదీని విమర్శించడం తగదన్నారు. భాజపా శాఖలన్నీ సేవా సంస్థలుగా మారినట్లు ఆయన వెల్లడించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న కరోనా సమయంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: సన్నాహక సమావేశాలు.. కార్యకర్తలకు దిశా నిర్దేశాలు!