తెలంగాణ

telangana

ETV Bharat / state

కమలం వికసిస్తుందా..! - modi campaign

ఉత్తరాన ఊపు మీదున్న కమలదళం..దక్షిణాదిపై గురిపెట్టింది. ముఖ్యంగా తెలంగాణలో ఒంటరిగా బరిలోకి దిగుతోంది. 17 స్థానాల్లో పోటీ చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. మోదీ, అమిత్​షా ప్రచారానికి రంగం సిద్ధం చేస్తోంది.

భాజపాలో ఎంపీ సీటుకు పోటీ

By

Published : Mar 14, 2019, 7:17 PM IST

Updated : Mar 14, 2019, 7:27 PM IST

కమలానికి కలిసిరాని దక్కన్

కమ్యూనిస్టులకు పట్టున్న కేరళలో భాజపా స్థానం సంపాదించుకోలేదు. ద్రవిడ అస్థిత్వ ఉద్యమాలతో తమిళనాడులోనూ ఇమడలేక పోయింది. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో అబాసు పాలవుతోన్న కమలానికి తెలంగాణ ఒక్కటే దిక్కుగా కనిపిస్తోంది. అందుకే జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తోంది.

కేంద్రమంత్రి పదవి వస్తుందనే ఆశ..!

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఫిబ్రవరిలోనే మొదలు పెట్టినప్పటికీ 17స్థానాలకు వందల్లో ఆశావాహులు ఉండటం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు, సీటు దక్కనివారు, సీనియర్ నేతలు బరిలో దిగానుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎంపీలుగా గెలిచినవారికి మంత్రి పదవులు వస్తాయని, ఇతర పార్టీల్లో టికెట్ రాని ముఖ్యనేతలు కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.

పార్టీలోనే తీవ్ర పోటీ

సికింద్రాబాద్‌ నుంచి సిట్టింగ్ ఎంపీ దత్తాత్రేయతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నేత కిషన్​రెడ్డి పోటీ పడుతున్నారు. హైదరాబాద్‌ లోక్​సభ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్‌ పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్సీ రాంచందర్​రావు, జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ర్ట ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారు. సికింద్రాబాద్ దక్కకపోతే మల్కాజ్‌గిరి నుంచైనా పోటీ చేయాలనేది కిషన్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. నిజామాబాద్​లో ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, చేవెళ్ల నుంచి జనార్దన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మోదీ, షా సభలు..

అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నందున అగ్రనేతలతో ఎక్కువ ప్రచార సభలు నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లో మోదీ సభలకు ప్రణాళికలు సిద్ధం చేయగా... మూడింటిని ఖరారు చేశారు. మరో నాలుగు సభల్లో అమిత్ షా పాల్గొననున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. నితిన్ గడ్కరీ, రాజ్​నాథ్‌ సింగ్, సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీని ప్రచారాని పంపాలని కమలనాథులు కోరినట్టు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరాపరాజయం చవిచూసిన కమలం..లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రెండు మాసాల ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేసిన భాజపా రాష్ర్ట నాయకత్వం... కారుకు బ్రేకులు వేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

ఇవీ చూడండి:చేతులు కాల్చుకుంటున్న కాంగ్రెస్

Last Updated : Mar 14, 2019, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details