BJP Election Plan Telangana 2023 :దక్షిణాదిలో కర్ణాటకలో అధికారం కోల్పోయినభారతీయ జనతా పార్టీ... తెలంగాణలో పాలనను దక్కించుకుని ప్రభావాన్ని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగా.. ఘట్‌కేసర్‌లోని వీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొని... కాషాయ దళానికి దిశానిర్దేశం చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని.. ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ వరకు... బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం బయటపడిందని విమర్శించారు. లీకేజీలతో 30 లక్షల మంది యువత ఆకాంక్షలను చిదిమేశారని ఆగ్రహించారు. ఇలాంటి ప్రభుత్వానికి శాశ్వతంగా సెలవు ఇవ్వాలన్నారు.
JP Nadda Fires on BRS : తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో.. కుటుంబ పాలన అంతం కావడం ఖాయం: జేపీ నడ్డా
JP Nadda Comments on BRS : దేశంలో ఏకైక జాతీయ పార్టీ బీజేపీ మాత్రమేనని నడ్డా స్పష్టం చేశారు. ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పోరాడుతోందన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించిన కాంగ్రెస్.. ప్రాంతీయ పార్టీలు పుట్టుకువచ్చేందుకు కారణమైందన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆర్జేడీ, జేఎంఎం, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, బీఆర్ఎస్, వైకాపా.. ఇలా అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారాయన్నారు. ఏపీలో వైఎస్సార్, జగన్‌రెడ్డి కుటుంబం.. తెలంగాణలో కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, మేనల్లుడు.. ఇలా కుటుంబాల అధీనంలోనే ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి గత తొమ్మిదేళ్లలో కేంద్రం రూ.9 లక్షల కోట్లు వ్యయం చేసిందని వివరించారు.
BJP Plan For Telangana Assembly Elections 2023 : ప్రధాని మోదీ పర్యటన అనంతరం రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగిందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ సాధనలో మొదటిసారి 369 మంది, రెండో విడతలో 1200 మంది మరణాలకు కాంగ్రెస్ కారణమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక చేత్తో పింఛను డబ్బులిచ్చి... మరో చేత్తో మద్యం అమ్మకాలతో లాక్కుంటుందోని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని వ్యూహాత్మంగా ఓటర్లుగా చేర్చి... గెలిచేందుకు బీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన ఏకైక పార్టీ.. ఎంఐఎం అని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే బీఆర్ఎస్లో చేరిపోతారంటూ.. జోస్యం చెప్పారు.