ప్రస్తుతం రోజుకో మోడల్ బైకు మార్కెట్లోకి వస్తున్న కాలమిది. అన్ని కంపెనీల లక్ష్యం యువతను ఆకట్టుకోవడమే. మైలేజ్, స్పీడ్‌తో పాటు చూడగానే మనసు దోచేలా ఉండాలని నేటితరం కోరుకుంటోంది. అలా లేకుంటే వారి నోట వచ్చేపదం రీమోడలింగ్. అలాంటి వారికోసమే ఏర్పాటైన సంస్థ ఉమెనియోటెరిక్. సరికొత్త డిజైన్లతో వాహనాలకు కొత్త అందాలు అద్దుతూ ప్రత్యేకత చాటుతున్నారు హైదరాబాద్‌కు చెందిన సత్యవాణి, సంగీత.
జీవితాన్నే పెయింటింగ్‌గా...
టెన్నిస్ క్రీడాకారిణి అయిన అక్క సత్యవాణికి జరిగిన ప్రమాదమే ఈ ఆలోచనకు కారణమంటోంది ఉమెనియోటెరిక్ వ్యవస్థాపకురాలు సంగీత. సత్యవాణిలో మానసిక స్థైర్యం నింపడానికి ఓ బైక్‌ను సంగీత, ఆమె తల్లి కానుకగా అందించారు. వినూత్నంగా ఆలోచించిన సంగీత బైక్‌పై తన అక్క జీవితాన్నే పెయింటింగ్‌గా వేశారు. తోటివారూ తమకు అలాంటి పెయింటింగ్ కావాలని కోరడంతో... ఆ పనినే వృత్తిగా మార్చుకున్నారు.