Bhogi Celebrations 2022: తెలుగు వారికి అతిపెద్ద పండగ సంక్రాంతి. మూడ్రోజుల సంప్రదాయ వేడుకలకు ఆరంభమే భోగి. ఇళ్లముందు వేసే భోగి మంటలతో.. సందడి మొదలైంది. చీకట్లను చీల్చుకుంటూ సూర్యుడు ఉదయించేలోపే ప్రతీ లోగిలిలో నులివెచ్చని కాంతికిరణాలు భోగిమంటల రూపంలో ప్రసరిస్తాయి. ఆవు పేడతో చేసిన పిడకలు, తాటాకులు, చెట్ల కర్రలను ఒకచోట వేసి..మంటలు వేస్తారు. ఇరుగుపొరుగు, చుట్టాలు పక్కాలు అంతా చుట్టూచేరి చలి మంటలు కాచుకుంటారు. ఆ నులివెచ్చని మంటలు వేకువ బద్ధకంతోపాటు మదిలోని నిరాశా నిస్పృహలనూ వదిలించే జ్వాలా తోరణాలు.
సూర్యుడి సంక్రమణంలో దక్షిణాయనానికి ఆఖరిరోజు భోగి ! దక్షిణాయనంలో..ఎదుర్కొన్న బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ప్రసాదించమని ప్రజలు ప్రార్థిస్తారు. పాత ఆలోచనల్ని వదిలించుకుని... కాలంతోపాటు వచ్చే మార్పులకు అనుగుణంగా మనసును సిద్ధం చేసుకుంటారు. భోగిమంటలయ్యాక ఇంటిల్లిపాదీ తలస్నానం చేసి కొత్తబట్టలు కట్టుకుంటారు. ఆనవాయితీగా పులగం తింటారు. కొత్త బియ్యం, పెసరపప్పు, నెయ్యి, మిరియాలు జోడించి వండే.. వంటకమే పులగం. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే పులగం.. చలికాలంలో జీర్ణశక్తిని ప్రేరేపిస్తుంది. అందుకే నేటితరం పిల్లలు ఏదో వింత వంటకంలా చూసి.. మేం తినం అని మారాం చేసినా..పెద్దవాళ్లు దాని విశిష్టతను చెప్పి తినిపిస్తారు.