Bhatti Vikramarka on Budget sessions: అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఇప్పటివరకూ అసెంబ్లీని ప్రొరోగ్ చేయలేదంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ఆరోపించారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్‌లో ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశంలో.. ప్రభుత్వ తీరుపై భట్టి విక్రమార్క పలు ఆరోపణలు చేశారు. సమావేశాలకు ముందుగా గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని భట్టి మండిపడ్డారు.
తూతూమంత్రంగా..
బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం ఈసారి పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు భట్టి తెలిపారు. ప్రజా సమస్యలు విస్తృతంగా చర్చించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా బడ్జెట్ సమావేశాలు జరపాలని ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు.