రైతుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలాయనవాదం పఠించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. భారత్ బంద్ సమయంలో రైతులకు మద్దతు తెలిపిన కేసీఆర్... దిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత 'యూ టర్న్' తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు దిల్లీలో ధర్నా చేస్తోన్న రైతులకు మద్దతుగా ఈ నెల 9న ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉదయం 10నుంచి సాయంత్రం 4గంటల వరకూ ధర్నా చేస్తున్నట్లు భట్టి పేర్కొన్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ శాసనసభాపక్ష సభ్యులంతా పాల్గొంటారని పేర్కొన్నారు.
కేసీఆర్ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం
రైతులు ఇంత చలిలో 43రోజులుగా దీక్ష చేస్తుంటే.. బాధ్యత కలిగిన ప్రధాని కానీ, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి కానీ వారి వద్దకు వెళ్లి కనీసం మాట్లాడకపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంట కొనటం వల్ల ప్రభుత్వానికి రూ. 7500కోట్ల నష్టం వస్తుందన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం చేసే పనులను ప్రభుత్వం ఎప్పుడూ లాభాపేక్షతో చూడరాదని హితవు పలికారు. రాష్ట్రంలో పండిన ప్రతి పంటను మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:'ఆర్టీసీ మనుగడకు డ్రైవర్లు, కండక్టర్లే ప్రధాన కారణం'