సాధారణంగా ఒక టీకా తయారు చేయాలంటే ఎన్నో సంవత్సరాల కాలం పడుతుందని, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో తక్కువ సమయంలోనే కరోనా వైరస్‌కు విజయవంతంగా టీకాను అందిచగలిగామని భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్ల అన్నారు. కరోనా లాంటి మహమ్మారులను తిప్పికొట్టడానికి మానవాళి ముందున్న పరిష్కారం టీకాలేనని పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ హెపటైటిస్ దినం (World Hepatitis Day) సందర్భంగా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి (KIMS Hospital) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
గతంలో ఏళ్ల తరబడి ఆగాల్సి వచ్చేది..
ఈ సందర్భంగా కిమ్స్ వైద్యులు, సిబ్బందిని ఉద్దేశించి డాక్టర్ ఎల్లా మాట్లాడారు. మానవాళికి పెనుముప్పుగా మారుతున్న హెపటైటిస్-బీ వ్యాధికి తక్కువ ధరలోనే వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. గతంలో ఒక వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కావాలంటే ఏళ్ల తరబడి సమయం పట్టేదని, ప్రస్తుతం పెరుగుతున్న సాంకేతికతతో వేగంగా చేయగలుగుతున్నామన్నారు. మొదట రోటా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ బయోటెక్‌కు ఎక్కువ సమయం పట్టిందని.. అదే కొవిడ్‌కు తక్కువ సమయంలోనే టీకా ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసి కోట్లమంది ప్రాణాలు కాపాడగలిగామన్నారు.