దిల్‌సుఖ్‌నగర్ శ్రీకృష్ణానగర్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి గుండెగోని బాలాగౌడ్. ఈయన మిద్దె సాగులో వినూత్న పంథాకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు జీ+ టెర్రస్ లేదా బాల్కనీలో ఇంటి పంటలను సాగు చేస్తుండటం చూశాం..కానీ బాలాగౌడ్ మాత్రం గత ఏడాది కర్మన్‌ఘాట్ లో నిర్మించిన 3500 చదరపు అడుగుల గత సువిశాల వాణిజ్య సముదాయంపై "మన ఇల్లు-మన మిద్దె తోట" పేరిట సేద్యం చేపట్టారు.దీనికి "శ్రీరాఘవేంద్ర ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్" అని నామకరణ చేశారు.
తమ కోసమే కాకుండా జంట నగరవాసుల సందర్శనార్ధం దీనిని తీర్చిదిద్దారు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులుకు ప్రత్యామ్నాయంగా జీవామృతం, వేపనూనె, ఘన జీవామృతం, ఇతర ప్రకృతి ఎరువులను వినియోగిస్తూ అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు, ఔషధ, సుగంధ పంటలు సాగు చేస్తున్నారు.
కార్పోరేట్ తరహాలో దశల వారీగా 6 లక్షల రూపాయల వరకు వెచ్చించి ఐదంతస్తులపైన "మన ఇల్లు - మన మిద్దెతోట"ను అందంగా తీర్చిదిద్దారు బాలాగౌడ్ . మొదట సూక్ష్మ సేద్య విధానాలతో, ప్లాస్టిక్ బకెట్లు, కోకోపీట్ ఉపయోగించి విత్తనాలు, మొక్కలు, అంట్లు నాటారు. ఎక్కడా చుక్క నీరు వృధా కాకుండా పూర్తి శాస్త్రీయ పద్ధతుల్లో... ప్రతి బొట్టు సద్వినియోగం చేసుకుంటూ 25 రకాలకు పైగా కూరగాయలు సాగు చేస్తున్నారు.
పాలకూర, గోంగూర, బచ్చలికూర, తోటకూర, కొత్తిమీర లాంటి 15 రకాల ఆకుకూరలను పెంచుతున్నారు.ఈ మిద్దెతోటలో పెరుగుతున్న 30 రకాలకు పైగా పండ్ల మొక్కలు మంచి ఫలాలు ఇస్తున్నాయి. బంతి, చేమంతి, గులాబీ, మల్లె, లిల్లీ, కనకాంబరం వంటి 40కి పైగా రకాల పూలు పరిమళాన్ని వెదజల్లుతున్నాయి.