తెలుగు రాష్ట్రాల్లో భారత్ (BH) రిజిస్ట్రేషన్ విధానం అమలుకు మరికొంత కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రం రూపొందించిన ఈ విధానం అమలుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఇంకా తర్జనభర్జన పడుతున్నాయి. పన్నుల విధానంలో వ్యత్యాసం ఉండటంతో ఆదాయానికి గండి పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అమలులో ఉన్న పన్నులతో పోలిస్తే కేంద్రం నిర్ణయించిన మొత్తాలు తక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణం.
అసలు ఏమిటీ ‘భారత్’
కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల, కొన్ని రకాల ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకూ బదిలీ అవుతుంటారు. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. వారు తమ వాహనాలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లాలంటే ఆయా రాష్ట్రాల్లోని నిబంధనల మేరకు జీవితకాలానికి పన్ను చెల్లించాలి. ఆ తరవాత వాహనం తొలుత రిజిస్ట్రేషన్ చేయించుకున్న రాష్ట్రంలోని రవాణా శాఖలో పత్రాలు సమర్పిస్తే.. ఆ రాష్ట్రంలో అంతకుముందు చెల్లించిన పన్నుల మొత్తాన్ని తిరిగిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే నెలలు పడుతుంది. రెండు రాష్ట్రాల మధ్య పలు దఫాలుగా తిరగాల్సి వస్తుంది. ఇది వ్యయప్రయాసలతో కూడినది కావటంతో వాహనాల యజమానులు బదిలీ అయిన రాష్ట్రంలో వాహనాల నమోదుకు ఆసక్తి కనబర్చటం లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ‘భారత్’ విధానాన్ని తీసుకువచ్చింది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు ‘బీహెచ్’ నంబర్ కేటాయిస్తారు. ఈ విధానంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునే వాహన యజమాని పనిచేస్తున్న సంస్థకు కనీసం నాలుగు రాష్ట్రాల్లో కార్యాలయాలు ఉండాలి. ఉద్యోగం చేస్తున్న కార్యాలయ ఉన్నతాధికారి నుంచి తీసుకున్న ధ్రువీకరణ పత్రాన్ని రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ భారత్ (BH) విధానం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవహారాల కోసం వాహనం పేరిట కేంద్రం ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది. అందులో తెలుగు రాష్ట్రాలు ఇంకా భాగస్వాములు కాలేదు. ‘వాహన్’తో అనుసంధానం కావటంలో నెలకొన్న సాంకేతిక చిక్కుముడులను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.