ప్రపంచాన్ని గడగలాడిస్తోన్న కరోనా వైరస్ కట్టడికి... ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. బయటకు వెళ్లకుండా ప్రభుత్వం అంక్షలు విధించడంతో... అత్యవసరమైతే తప్ప గడప దాటట్లేదు. గత 5 వారాలుగా చాలామంది... టీవీలు, కంప్యూటర్లకే అతుక్కుపోతుండటం వల్ల... సాధారణ రోజులతో పోలిస్తే అంతర్జాల వినియోగం మూడురెట్లు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని అంతర్జాల వినియోగదారుల్ని ఆకర్షించేలా... సైబర్ నేరగాళ్లు ప్రకటనలు జారీ చేస్తున్నారు. వివిధ సంస్థల పేరిట ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వీటిని నమ్మి... అమాయకులు మోసపోతున్నారు. వైరస్ సోకుతుందనే భయంతో కొందరు డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు. యూపీఐ, వాలెట్లు అప్‌డేట్ చేసుకోవాలని సదరు సంస్థల పేరిట లింకులు పంపిస్తూ.... వారి ఖాతాల్లో ఉన్న నగదును మాయం చేస్తున్నారు. వాహనాలు, ఇతర ఖరీదైన వస్తువులను తక్కువ ధరకే విక్రయిస్తామంటూ ప్రకటనలిస్తున్న సైబర్ నేరగాళ్లు... అడ్వాన్స్‌గా కొంత మొత్తం చెల్లించాలని చెప్పి, ఆ తర్వాత డబ్బులు తీసుకొని ఫోన్లు స్విచాఫ్ చేస్తున్నారు.
కరోనా వైరస్ నియంత్రణ కోసం భౌతికదూరం పాటించడం, మాస్కు ధరించడం, చేతులను శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలని.. ప్రభుత్వాలు, వైద్యనిపుణులు సూచిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో వాటికి గిరాకీ పెరగడంతో... కొన్నిచోట్ల ఆ వస్తువులు లభించని పరిస్థితి నెలకొంది. దాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎన్-95 మాస్క్‌లు, శానిటైజర్లు... సరసమైన ధరలకే విక్రయిస్తామంటూ ప్రకటనలిస్తున్నారు. వాటిని నమ్మిఫోన్ చేస్తే బ్యాంకులో కొంతడబ్బు జమచేస్తే... ఆర్డర్ తీసుకుంటామని నమ్మబలుకుతున్నారు. రోజులు గడుస్తున్నా ఆర్డర్ చేసిన వస్తువులు రాకపోవడం వల్ల సదరు నంబర్‌కు ఫోన్ చేస్తే స్విఛ్చాప్ అని వస్తోంది. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు... సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నెల రోజులుగా సీసీఎస్‌లో ఈ తరహా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జంటనగరాలకు చెందిన పలువురు... సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి పోలీసులను ఆశ్రయించారు.