Banks stopped disbursing money: హైదరాబాద్: ప్రస్తుత యాసంగిలో పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతుబంధు పథకంలో జమచేస్తున్న సొమ్మును బ్యాంకులు ఆపేస్తున్నాయి. ఆ మొత్తాన్ని పాత బాకీ ఖాతాలకు మళ్లిస్తున్నాయి. గత పదిరోజుల్లో 54.70 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.4,327.93 కోట్లను వ్యవసాయశాఖ జమచేసింది. కానీ రైతు పంట రుణం పాత బాకీ చెల్లిస్తేనే ఈ నిధులు విడుదల చేస్తామని కొన్ని బ్యాంకులు కరాఖండిగా చెపుతున్నాయి.
ఇవే కాకుండా గత వానాకాలంలో పండించిన వరిధాన్యాన్ని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ఆ సొమ్మును కూడా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తోంది. ఆ సొమ్మునూ పాత బాకీ ఖాతాలకే బ్యాంకులు మళ్లిస్తున్నాయి. వానాకాలం పంట సొమ్ము రాక, రైతుబంధు కింద ప్రభుత్వం ఇచ్చే సొమ్మూ అందక యాసంగి పంటల సాగుకు సొమ్ముల్లేక రైతులు అవస్థలు పడుతున్నారు. రైతుబంధు సొమ్మును ఆపవద్దని, ఇతర బాకీలు ఉన్నా వాటితో దీనిని ముడిపెట్టకుండా నగదు ఇచ్చేయాలని వ్యవసాయశాఖ గతంలో బ్యాంకులకు చెప్పినా క్షేత్రస్థాయిలో బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదు.
గొల్ల కురుమల సొమ్మూ పాత బాకీలకే..మరోవైపు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ గొర్రెల పంపిణీకి గొల్ల, కురుమల బ్యాంకు ఖాతాల్లో ఇటీవల నేరుగా నగదు బదిలీ (డీబీటీ) విధానాన్ని ప్రారంభించింది. తొలుత ప్రయోగాత్మకంగా నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం పరిధిలోని 4699 మంది గొల్ల, కురుమల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.లక్షా 58 వేల చొప్పున ఈ శాఖ జమచేసింది. ఈ సొమ్మును కూడా పాతబాకీ ఖాతా కింద తీసుకున్నామని, గొర్రెలు కొన్నా ఇచ్చేది లేదని బ్యాంకులు చెపుతున్నాయని గొల్ల, కురుమలు వాపోతున్నారు. ధాన్యం అమ్మిన డబ్బును కూడా ఆపడంతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని గొల్ల, కురుమల సంఘాల నేత జక్కలి ఐలయ్య యాదవ్ ‘ఈనాడు’కు చెప్పారు.
రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం రైతు పంట రుణం తీసుకుంటే తిరిగి ఏడాదిలోగా కట్టడానికి బ్యాంకు గడువు ఇవ్వాలి. ఈలోగా అడగటానికి వీలులేదు. కానీ రుణమాఫీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పాత రుణాలను తిరిగి చెల్లిస్తుందని భావించి రైతులు కట్టడం లేదని ఓ బ్యాంకు రాష్ట్రస్థాయి అధికారి ఒకరు చెప్పారు. పాత బాకీ పూర్తిగా కట్టకున్నా కనీసం వడ్డీ కట్టి తిరిగి కొత్తరుణం తీసుకున్నట్లు రెన్యూవల్ చేసుకోవాలని చెప్పినా పలువురు రైతులు ముందుకు రావడం లేదని ఆయన వివరించారు. ఒకసారి పంటరుణం తీసుకున్న తరవాత వరసగా మూడో పంట సీజన్లోగా తిరిగి కట్టకపోతే ఆ ఖాతాను నిలిపివేస్తామన్నారు. తాము రిజర్వుబ్యాంకు నిబంధనలనే పాటిస్తామని, పాతబాకీలు కట్టనివారి పొదుపు ఖాతాల్లో ఉన్న సొమ్మును విడుదల చేయకుండా నిలిపివేసే అధికారం తమకు ఉందని ఓ బ్యాంకు అధికారి ‘ఈనాడు’కు చెప్పారు. రైతుబంధు కింద వ్యవసాయశాఖ జమచేసిన నిధులను బ్యాంకులు ఆపడానికి వీల్లేదని ఆశాఖ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
రైతుబంధు సొమ్ము ఇవ్వక వరినాట్లు వేయలేకపోతున్నా