Nandakumar in Police custody : ఎమ్మెల్యేలకు ఎర కేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన నందకుమార్‌ను బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఫిలింనగర్‌లోని దక్కన్ కిచెన్ స్థలాన్ని సబ్ లీజుకు ఇచ్చి డబ్బులు వసూలు చేశారన్న కేసు దర్యాప్తులో భాగంగా నందకుమార్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న నందకుమార్‌ను.. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. దక్కన్ కిచెన్ స్థలం లీజ్, సబ్ లీజుకు సంబంధించి నందకుమార్‌ను ప్రశ్నిస్తున్నారు. రేపూ నందకుమార్‌ను ప్రశ్నించనున్నారు.
ఫిలింనగర్‌లోని దక్కన్ కిచెన్ విషయంలో నందకుమార్‌పై కేసు నమోదైంది. హీరో దగ్గుబాటి రానా, నిర్మాత సురేశ్ బాబులకు సంబంధించిన ఈ భూమిని లీజుకు తీసుకున్న నందు.. ఆ ప్రదేశంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి సబ్ లీజ్‌కు ఇచ్చి డబ్బులు వసూలు చేశారని ముగ్గురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఐపీసీ సెక్షన్ 406, 420, 506 కింద మూడు వేర్వేరు కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా నందకుమార్‌ను రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు.
మరోసారి సిట్ ముందుకు చిత్రలేఖ..:మరోవైపు 'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో నందకుమార్ భార్య చిత్రలేఖ నేడు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఆమెను సుదీర్ఘంగా విచారించిన సిట్ బృందం.. అనుమానాలు నివృత్తి కాకపోవడంతో ఈరోజు మళ్లీ రావాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే చిత్రలేఖ ఈరోజు మరోసారి సిట్ ముందు హాజరయ్యారు.