తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ కవలలకు తల్లిని దూరం చేసిన రోడ్డు ప్రమాదం - ACCIDENTS IN HYD

యాక్సిడెంట్​ అంటే కారో, బైకో... రోడ్డు మీద పడటం కాదు... ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడటం అని ఓ హీరో... సినిమాలో చెప్పిన డైలాగ్​. కానీ ఈ మాటలు నిజమనే చెప్పాలి. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్​ 12 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. కానీ ఆమె మరణం ఎన్నో అనుబంధాలను ఛిన్నాభిన్నం చేసింది.

Banjara Hills Accident etv bharat special story
ఆ కవలలకు తల్లిని దూరం చేసిన రోడ్డు ప్రమాదం

By

Published : Nov 28, 2019, 12:12 PM IST

ఆ కవలలకు తల్లిని దూరం చేసిన రోడ్డు ప్రమాదం

హైదరాబాద్​ బంజారాహిల్స్​ రోడ్​ నంబర్​ 12లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్లక్ష్యంగా బస్సు నడిపి సోహిని సక్సేనా మృతికి కారణమైన తాత్కాలిక డ్రైవర్​ శ్రీధర్​ను పోలీసులు రిమాండ్​కు తరలించారు. ఆమె మృతి కుటుంబాన్ని ఛిన్న భిన్నం చేసింది.

  1. టాటా చెప్పి బయటకు వెళ్లిన అమ్మను ఎక్కడికి తీసుకెళ్లారు? ఇంటికి రాలేదే? ఎప్పుడొస్తుంది నాన్నా? - మూడేళ్ల వయసున్న ఆ కవల పిల్లలు వచ్చీరాని మాటల తూటాలివి... వీటికి జవాబిచ్చేదెవరు? కన్నుమూసిన తల్లి కోసం కలవరించే బిడ్డలకు ఎలా బదులివ్వాలి? ఏం చెప్పాలన్నా ఉబికి వచ్చే కన్నీటి భాష ఆ పసిహృదయాలకు ఎలా అర్థమయ్యేను?
  2. ‘ఒక్కగానొక్క చెల్లి.... పొద్దున్నే ఫోన్‌ చేసింది. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది... కొన్ని గంటల్లోనే ఆమె లేదన్న వార్త విని ఎలా బతికున్నామో అర్థం కావట్లేదు’... ఇది ఆమె సోదరుడి మనో వేదన.
  3. ఈ మధ్యనే తండ్రిని కోల్పోయాను. పుట్టెడు దుఃఖంలో ఉన్న నన్ను నిత్యం ఓదార్చే నా భార్య ఏమైంది? ఒక్కసారిగా నా జీవితంలో ఏమిటీ శూన్యం? ఇద్దరు బిడ్డలు అమ్మను అడుగుతుంటే వారిని ఎలా సముదాయించగలను?’ - ఇది ఆమె భర్త హృదయాక్రోశం.

ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు

టీసీఎస్‌లో పనిచేస్తున్న సోహినీ మంగళవారం ఉదయం తన పిల్లలిద్దర్నీ సమీపంలోని ప్లేస్కూల్‌ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. వారికి టాటా చెప్పి ద్విచక్ర వాహనంపై తాను పనిచేసే సంస్థకు బయలుదేరారు. గమ్యం చేరకముందే ఆర్టీసీ బస్సు రూపంలో ఆమెను మృత్యువు కబళించింది.

అప్పుడు తండ్రి మరణం.. ఇప్పుడు భార్య

ఇద్దరు కవల పిల్లలు అక్షయ్‌, అంకిత్‌ తల్లి మృతదేహం వద్ద.. ‘అమ్మా.. ఇటు చూడమ్మా’ అంటూ దీనంగా వేడుకోవడంతో రోదనలు మిన్నంటాయి. భార్య మరణంతో కుదేలైన వినీత్‌ కుమార్‌ మాథూర్‌ పిల్లలను హత్తుకొని పెద్దపెట్టున రోదించారు. ఫెడరల్‌ బ్యాంకు మేనేజర్‌గా ఉద్యోగ విమరణ చేసిన ఆయన తండ్రి కె.కె.మాథూర్‌ రెండు నెలల కిందటే అనారోగ్యంతో మృతి చెందారు. ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోని వినీత్‌కు భార్య మరణం అశనిపాతమైంది.

ఆదివారం వస్తానని...

సోహినీ సోదరుడి ఆవేదన కూడా అంతులేనిది. మంగళవారం ఉదయమే తనకు సోహినీ ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిందని, ఆదివారం పిల్లలను తీసుకొని ఇంటికొస్తానని చెప్పిందని, ఇంతలోనే ఇలా జరిగిందని ఆమె పెద్ద సోదరుడు రిషికేష్‌ రోదించారు. సోదరి ఇక లేదన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక వారంతా చిన్నపిల్లల్లా కన్నీరుమున్నీరయ్యారు.

సోహినీ పిల్లలు స్థానికంగా ఉన్న ఓ ప్లేస్కూల్‌లో చదువుతున్నారు. వారిని గీతాంజలి పాఠశాలలో చేర్చేందుకు ఆమె దరఖాస్తు చేసింది. సొహినీ మరణవార్త తెలియని ఆ పాఠశాల నిర్వాహకులు బుధవారం ఉదయం పిల్లలకు ప్రవేశం లభించిందంటూ ఆమె నంబరుకు ఫోన్‌ చేశారు. ఏం సమాధానం ఇవ్వాలో తెలియక తర్వాత మాట్లాడతామని కుటుంబీకులు చెప్పారు. సోహినీ అంత్యక్రియలను పురానాపూల్‌ శ్మశానవాటికలో బుధవారం పూర్తి చేశారు.

ఈ కథనం చూడండి: నిర్లక్ష్యపు డ్రైవింగ్.. తీసింది సాఫ్ట్​వేర్ ఇంజినీర్ ప్రాణం...

ABOUT THE AUTHOR

...view details