తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay: 'ఎన్నికలు వస్తున్నాయనే రూ.1000 పెంచి.. గొప్పలు' - బండి సంజయ్

Bandi Sanjay on Sanitation Workers Salary Hike: ఎన్నికలు వస్తున్నాయనే పారిశుద్ధ్య కార్మికులకు రూ.వెయ్యి పెంచి.. గొప్పలు చెప్పుకుంటున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. పారిశుద్ధ్య కార్మికులెవరూ బాధపడొద్దని.. ఆరు నెలలు ఓపిక పడితే బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు అదనంగా వేతనం పెంచుతామని పేర్కొన్నారు.

Bandi Sanjay
Bandi Sanjay

By

Published : May 2, 2023, 8:02 PM IST

Bandi Sanjay on Sanitation Workers Salary Hike: తెలంగాణ పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం పెంచిన.. రూ.వెయ్యి వేతనం ఏమాత్రం సరిపోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల్లో అత్యధిక శాతం దళిత, గిరిజన, వెనకబడిన వర్గాలేనన్న ఆయన... అత్యంత పేదరికంలో ఉన్న వీరికి రూ.వెయ్యి మాత్రమే పెంచడం సరికాదన్నారు. ఇది కంటి తుడుపు చర్య మాత్రమేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

ఎన్నికలు వస్తున్నాయనే.. రూ.వెయ్యి పెంపు: సీఎం కేసీఆర్ పాలనలో పారిశుద్ధ్య కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదని.. ఉద్యోగ భద్రత ఊసేలేదని సంజయ్ ఆరోపించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో పారిశుద్ధ్య కార్మికుల పని వెలకట్టలేనిదన్నారు. ఆరోగ్యాన్ని, వయస్సును పట్టించుకోకుండా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అహర్నిశలు పని చేస్తున్నారని అన్నారు. కార్మికులకు అనారోగ్య సమస్య తలెత్తితే పట్టించుకునే యంత్రాంగం లేదని.. ఇలాంటి వారి పట్ల కేసీఆర్ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికలు వస్తున్నాయనే.. రూ.వెయ్యి పెంచి, ప్రేమను ఒలకపోస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు.

ఆరు నెలలు ఓపిక పట్టండి.. వచ్చేది మన ప్రభుత్వమే: పారిశుద్ధ్య కార్మికులెవరూ బాధపడొద్దని.. ఆరు నెలలు ఓపిక పడితే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు అదనంగా మరో రూ.2 వేల వేతనం పెంచుతామని ప్రకటించారు. దసరా, ఉగాది పర్వదినాల సమయంలో ప్రత్యేక బోనస్ అందిస్తామన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఓపెన్ ఇంటర్మీడియట్‌ పరీక్షలో తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో పరీక్ష పేపర్లు అందజేయడం విడ్డూరమన్నారు. ప్రభుత్వానికి ఓపెన్ స్కూల్ సోసైటీ పరీక్షలు కూడా నిర్వహించడం చేతకాకపోవడం సిగ్గుచేటని బండి సంజయ్ దుయ్యబట్టారు.

మే డేను పురస్కరించుకుని తెలంగాణలోని పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.వెయ్యి చొప్పున.. పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో.. తెలంగాణలోని లక్షా 6 వేల 474 మంది పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. జీహెచ్​ఎంసీ, జలమండలి సహా తెలంగాణలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. ప్రస్తుత వేతనానికి.. అదనంగా రూ.వెయ్యి అందనున్నాయి. పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details