Bandi sanjay Letter To Cm: హరితహారం పేరుతో పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను ఉపాధి లేకుండా చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వం తక్షణం.. పోడుభూముల్లో హరితహారం కార్యక్రమం నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల వేలాది మంది గిరిజనులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము హరితహారం కార్యక్రమానికి వ్యతిరేకం కాదని కేవలం పోడు భూముల్లో మాత్రమే నిలిపివేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమం చేపడితే భాజపాకు ఎలాంటి అభ్యంతరం ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసారు.
పోడు భూముల సమస్యపై సీఎంగా 2019లో అసెంబ్లీలో చేసిన ప్రకటన ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఉందన్నారు. రాష్ట్రంలో 24 జిల్లాల్లో 10 లక్షలకు పైగా పోడు భూముల పట్టాల సమస్య ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2006 సంవత్సరంలో పోడుభూములకు పట్టాల కోసం 1,83,252 దరఖాస్తులు రాగా 1,01,177 మందికి హక్కు పత్రాలు అందాయి. అప్పటినుండి కొనసాగుతున్న పోడుభూముల సమస్యపై ప్రభుత్వం తాత్సారం చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఆరోపించారు. కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం అడవిపై, అటవీ ఫలాలపై, పోడుభూములపై గిరిజనులకు పూర్తి హక్కులున్నాయని చట్టపరంగానే వారికున్న హక్కులను తెరాస ప్రభుత్వం కాలరాయడం క్షమించరాని నేరమని అగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలకోసం ఒకవైపు ఆందోళనలు జరుగుతుండగా మరోవైపు ఆ భూముల్లో హరితహారానికి ఫారెస్ట్ అధికారులు సన్నాహం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ చర్యల వలన గిరిజన ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని సంజయ్ హెచ్చరించారు.