Bandi Sanjay Comments on TRS Protests: ప్రజల దృష్టి మరల్చేందుకే తెరాస శ్రేణుల నిరసనలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను విమర్శిస్తే తెరాసకు అభ్యంతరమెందుకంటూ ప్రశ్నించారు. దిల్లీలో భాజపా నేతలతో కలిసి ఆయన తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఆయా రాష్ట్రాల విషయంలో కాంగ్రెస్ అనుసరించిన విధానాన్ని మోదీ విమర్శించారని బండి తెలిపారు. అయినా కాంగ్రెస్‌ను ప్రధాని విమర్శిస్తే.. తెరాసకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆరోపించారు. అందుకే ఇవాళ తెలంగాణలో ఆ పార్టీకి ఆదరణ పోయిందని చెప్పారు. 1999లో ఎన్డీఏలోని పార్టీలు అడ్డుపడటం వల్ల తెలంగాణ ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని... పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కొట్టడం తప్పని మోదీ అన్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.
'ప్రజల దృష్టి మరల్చేందుకే తెరాస శ్రేణుల నిరసనలు చేస్తున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పుడు ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు? తెలంగాణ వద్దన్న ద్రోహులనే ఇవాళ కేసీఆర్ చేరదీశారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం ఏమైనా చేసిందా? కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారు? ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.'