Bandi Sanjay Comments on Komatireddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణ ఎన్నికల బరిలో కాంగ్రెస్ లేదనే విషయం స్పష్టమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందనే... తమ పార్టీని కేసీఆర్ లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. బీజేపీను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, బీఆర్ఎస్ ఏకమవుతాయని పేర్కొన్నారు.
''కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తేటతెల్లమైంది. తెలంగాణ ఎన్నికల బరిలో కాంగ్రెస్ లేదనే విషయం స్పష్టమైంది. రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది. బీజేపీను ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, బీఆర్ఎస్ ఏకమవుతాయి.'' - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయిందని పేర్కొన్న బండి... ఎన్నికల్లో ఎవరైనా గెలుస్తామని చెప్తారు కానీ.. కాంగ్రెస్ నేతలే ఓడిపోతామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓడిపోతామని తెలిసి కూడా యాత్రలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. 119 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని.. జోస్యం చెప్పారు.
''ఎన్నికలకు ముందు సపరేటుగా పోటీ చేసి ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అది ప్రజలను మోసం చేయడమే. మోదీ నిజాయితీ పరులు.. కాబట్టి ప్రజలు మాకే ఓటేస్తారు. కేసీఆర్ ఇంకా ఈటల రాజేందర్ ఆయన మనిషి అనుకుంటున్నారు.'' - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఎన్నికల బరిలోంచి కాంగ్రెస్ ఔట్.. కోమటిరెడ్డి వ్యాఖ్యల అర్థమిదే: బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ డిప్రెషన్‌లో... కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్‌పై ఉందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఇంతకు ముందు బీఆర్ఎస్ కలలు కనేది.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలలు కంటుందని ఎద్దేవా చేశారు. కుటుంబ పాలన, అవినీతి పాలన, రైతుల వ్యతిరేక పాలన, నిరుద్యోగ వ్యతిరేక పాలన.. బీఆర్ఎస్ ప్రభుత్వానిదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ బీ టీం అని అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. 119 స్థానంలో బీజేపీ పోటీ చేస్తుందన్నారు.
ఇంతకీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే... రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ రాదని ఎంపీ కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.... వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ 60కి మించి సీట్లు రావని వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కేసీఆర్ కలవక తప్పదన్నారు. కాంగ్రెస్‌లో అందరం కష్టపడితే 40 నుంచి 50 స్థానాలు వస్తాయన్న కోమటిరెడ్డి.... అధికారంలో కాంగ్రెస్ ఉండటం ఖాయని చెప్పారు. పాదయాత్ర రూట్ మ్యాప్‌పై పార్టీ అధిష్ఠానం అనుమతి తీసుకుంటానన్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పొత్తులపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం తీవ్రంగా ఖండించారు. హంగ్ ఏర్పడే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకు వెళ్లాల్సి వస్తుందని చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, పీసీసీ ఉపాధ్యక్షులు సామల కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌లు... కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.
కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఎవరితోనూ పొత్తు ఉండదని వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ కేడర్‌ను గందరగోళానికి గురిచేసే విధంగా పొత్తుపై మాట్లాడడం సరికాదన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి సంబంధంలేదని అది అయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కానీ ఎన్నికల తర్వాత కానీ ఎవరితోనూ పొత్తు ఉండదని వెల్లడించారు. మొత్తానికి కోమటిరెడ్డి వ్యాఖ్యలు అటు కాంగ్రెస్‌లోనూ, ఇటు బీజేపీలోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఇవీ చదవండి: