ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ఉద్యాన రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. లాభాల తీపి రుచి చూపిస్తుందని అరటి సాగుపై మక్కువ చూపిన రైతులు నేడు నష్టాలను చవిచూస్తున్నారు. ఆదుకునే వారు లేక .. పంటను వదిలేస్తున్నారు. దువ్వూరు మండలం రామాపురం వద్ద రైతులు పంటను గొర్రెల మందకు మేతగా వదిలేస్తున్నారు. నియోజకవర్గంలో 500 హెక్టార్లలో అరటి సాగు కాగా .. 32వేల 500 టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యాన అధికారులు ఇటీవల అంచనా వేశారు.
అరటి గొర్రెల పాలు.. ఆశలు మట్టిపాలు - కడపలో అరటి కష్టాలు
కరోనా దెబ్బకు ఆంధ్రప్రదేశ్ కపడ జిల్లాలో అరటి రైతులు విలవిల్లాడుతున్నారు. దువ్వూరు మండలంలో సుమారు 800 ఎకరాల్లో అరటి సాగు చేశారు. గత నెల టన్ను రూ.10 వేలు పలికింది. ప్రస్తుతం టన్ను రూ. వెయ్యికి ఇస్తామన్నా కొనేవారు కనిపించడం లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. చేసేదిలేక పంటను పశువులకు మేతగా వదిలేస్తున్నారు.
అరటి గొర్రె పాలు.. ఆశలు మట్టిపాలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు అరటి రైతులను ఆదుకునేందుకు రూ. 3500తో కొనుగోలు చేస్తామంటూ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు మార్కెటింగ్ ద్వారా కేవలం 547 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. రైతులే వ్యాపారులతో ఒప్పందం చేసుకుని 3490 టన్నులు విక్రయించుకున్నారు. అటు ప్రభుత్వం కొనుగోలు చేయక ఇటు వ్యాపారులకు విక్రయించుకోలేని రైతులు పండిన పంటను పశువులకు వదిలేస్తున్నారు.