Telangana budget sessions 2023-24 : గవర్నర్ ప్రసంగంతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం రోజున ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే శాసనసభను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై స్పీకర్ నిర్ణయం ప్రకారమే ముందుకు వెళ్లాలని అసెంబ్లీ కార్యకలాపాల సలహా కమిటీ(బీఏసీ) నిర్ణయించింది. శుక్రవారం తన కార్యాలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన బీఏసీ సమావేశంలోనూ దీనిపై స్పష్టత రాలేదు.
BAC on Telangana budget sessions : ఈనెల 8న స్పీకర్ ప్రకటించేలా నిర్ణయం జరిగినట్లు తెలిసింది. ఆ రోజు మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుందామని మంత్రులు చెప్పినట్లు సమాచారం. గవర్నర్ ప్రసంగంపైన, బడ్జెట్‌పైన, పద్దులపైన పూర్తిస్థాయిలో చర్చలు జరగాలని కాంగ్రెస్ కోరగా... ఏయే అంశాలపై చర్చను కోరుకుంటున్నారో చెప్పండి, ఎన్ని రోజులు నిర్వహించడానికైనా తమకేమీ అభ్యంతరం లేదని మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
Telangana budget sessions 2023 updates : 6న బడ్జెట్... 8న చర్చ... గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శనివారం అసెంబ్లీలో ప్రవేశపెడతారు. దీనిపై సీఎం సహా విపక్ష సభ్యులు మాట్లాడతారు. 5న ఆదివారం శాసనసభకు సెలవు. 6న సోమవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 7న అసెంబ్లీకి, మండలికి సెలవు. 8న బడ్జెట్‌పై సాధారణ చర్చ ఉంటుంది. 9 నుంచి పద్దులపై చర్చ కొనసాగుతుంది.
రైతులకు రుణమాఫీ, దళితబంధు తదితర అంశాలపై చర్చించాల్సిన అవసరముందని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నట్లు సమాచారం. బీఏసీకి హాజరుకాని మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ సమావేశాలను 20 రోజులకు పైగా నిర్వహించాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాశారు. మైనారిటీ సంక్షేమం, పాతబస్తీ సమస్యలు తదితర 25 అంశాలపై చర్చించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. ఉప సభాపతి పద్మారావు, మంత్రులు కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు.
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం రోజున గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగంతో మొదలైన విషయం తెలిసిందే. ప్రతి రంగంలోనూ ఆశ్చర్యపోయే విధంగా సమ్మిళిత సమగ్రాభివృద్ధిని సాధిస్తూ తెలంగాణ యావత్‌దేశానికి ఆదర్శంగా నిలిచిందని తమిళిసై ప్రశంసించారు. ‘అగాథమైన పరిస్థితి నుంచి పురోగమించేందుకు ప్రభుత్వం అనేక సవాళ్లను దీటుగా ఎదుర్కొంది. అస్పష్టతలను, అవరోధాలను అధిగమించింది. ఎనిమిదిన్నరేళ్ల స్వల్ప కాలంలోనే తెలంగాణ అద్భుత విజయాలను సాధించింది’ అని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనా దక్షత, ప్రజాప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం, ప్రజల ఆశీస్సుల వల్లనే తెలంగాణ అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా, సంక్షేమం, అభ్యున్నతిలో అగ్రగామిగా రూపుదిద్దుకుందని ఆమె వివరించారు.