సుఖాసనంలో కూర్చుని శ్వాస తీసుకుంటూ చేతులు పైకి, శ్వాస వదులుతు చేతులు కిందికి పెట్టాలి. మోచేతులు కిందికి ఉంచాలి. మెల్లగా శ్వాస తీసుకోవాలి, వదలాలి. మరీ వేగంగా చేయకూడదు. ఇరవైసార్లు చేసిన తర్వాత ఆగి మళ్లీ ఇరవైసార్లు చేయాలి. ఇలా ఐదు రౌండ్లు చేయాలి. ఇరవైసార్లు చేయలేకపోతే పది చొప్పున కూడా చేయొచ్ఛు ఇది చేయడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడటమే కాకుండా వీటి సామర్థ్యమూ పెరుగుతుంది. అలాగే శ్వాసనాళాలు శుభ్రపడతాయి.
రెండు కాళ్లను ముందుకు చాపి కూర్చోవాలి. కుడి పాదాన్ని ఎడమ మోకాలు పక్కన పెట్టాలి. ఎడమ కాలిని వెనక్కి మడవాలి. ఇప్పుడు ఎడమచేత్తో కుడి కాలిని పట్టుకోవాలి. కుడిచేతిని నడుం వెనక పెట్టుకోవాలి. శ్వాస వదులుతూ మెల్లగా నడుము, భుజాలు, తలను వెనక్కు తిప్పాలి. ఈ స్థితిలో మూడు నిమిషాల వరకు ఉండొచ్ఛు తర్వాత శ్వాస తీసుకుంటూ యథాస్థితికి వచ్చేయాలి. ఇలా మూడుసార్లు చేయాలి. తర్వాత ఇదేవిధంగా మరోకాలితో చేయాలి. దీనివల్ల పొట్ట దగ్గర ఉన్న కండరాలు బలపడతాయి. అధిక కొవ్వు తగ్గుతుంది. గ్రంథులన్నీ చురుగ్గా పనిచేయడంతోపాటు రోగనిరోధక శక్తీ పెరుగుతుంది.