తెలంగాణ

telangana

ETV Bharat / state

కూరగాయల పేరు చెబితేనే.. బెంబేలెత్తుతున్న ప్రజలు

సామాన్యుడి నుంచి ధనవంతుడి వరకు నిత్యావసర సరకుల జాబితాలో ప్రధానంగా కనిపించేవి కూరగాయలు. ఇవి లేకుండా రోజు గడవదు. కొనకా తప్పదు. ఇప్పుడిదే వినియోగదారులకు తంటాలు తెచ్చి పెడుతోంది. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. నిత్యావసరాలపైనా అది స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా సంక్షోభంతో ఉపాధి కోల్పోయి కొందరు, ఆదాయం తగ్గి మరి కొందరు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలోనే నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలూ ఆకాశాన్నంటడం మింగుడు పడటం లేదు.

కూరగాయల పేరు చెబితేనే.. బెంబేలెత్తుతున్న ప్రజలు
కూరగాయల పేరు చెబితేనే.. బెంబేలెత్తుతున్న ప్రజలు

By

Published : Sep 18, 2020, 4:58 AM IST

కూరగాయల పేరు చెబితేనే.. బెంబేలెత్తుతున్న ప్రజలు

కూరగాయల పేరు చెబితేనే.. పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తాల్సి వస్తోంది. అంతగా భయపెడుతున్నాయి వాటి ధరలు. రూ. 500 నోటుతో మార్కెట్‌కు వెళ్తే సంచి నిండా కూరగాయలతో ఇంటికొచ్చే వారు. ఇప్పుడు అందులో సగం కూడా నిండటం లేదు. అసలే నిత్యావసరాలు బంగార మైపోయాయి. వీటికి తోడు కూరగాయల ధరలూ కొండెక్కి కూర్చున్నాయి. వినియోగదారులకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. లాక్‌డౌన్‌లోనే కాదు. అన్‌లాక్ ప్రక్రియ మొదలయ్యాకా ఇదే పరిస్థితి. చాలామంది కిలో కొనే దగ్గర అరకిలోకే సరి పెట్టుకుంటున్నారు. పౌష్టికాహారం తీసుకోవాల్సిన ఈ తరుణంలో ధరల పెరుగుదల అందరినీ కలవర పెడుతోంది.

సరఫరా తగ్గి.. రేటు పెరిగి

సాధారణంగా వేసవిలో ఎండల ధాటితో పోటీపడే కాయగూరల ధరలు, వర్షాకాలంలో కాస్త తగ్గుముఖం పడుతుంటాయి. కరోనా సంక్షోభానికి తోడు భారీవర్షాలు కురవటం వల్ల పంటలు నష్ట పోవాల్సి వచ్చింది. దిగుబడులు తగ్గాయి. గిరాకీ పెరిగి సరఫరా తగ్గిపోవటం వల్ల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. 15 రోజుల్లోనే ఉత్తరాది అంతటా కాలీఫ్లవర్‌, బఠాణీ, టొమాటో, బంగాళదుంప, ఉల్లి గడ్డల ధరలకు రెక్కలు వచ్చాయి. పుణె నుంచి కోల్‌కతా వరకు, దిల్లీ మొదలు చెన్నై వరకు సరఫరా తగ్గిపోయాయి. కిలో బీన్స్‌ 80, చిక్కుడు 70 వరకు పలుకుతున్న తెలుగు రాష్ట్రాల్లో ఆకుకూరల ధరలూ మండిపోతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.

అమాంతంగా..

స్థానికంగా పండించే బీర, దొండ, కాకర, గోరుచిక్కుడు వంటి రకాలూ భారీ వర్షాలకు దెబ్బ తినడం వల్ల సరఫరా తగ్గి... గిరాకీ పెరిగింది. పచ్చి మిర్చి కిలో ధర రూ. 100 టమాట కిలో రూ. 60 పలుకుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా వంకాయలు, బీరకాయ ధరలూ అమాంతం పెరిగాయి. ఇటీవల వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. నెల రోజులుగా ధరలు ఏ మాత్రం తగ్గకపోగా పెరుగుతూనే ఉన్నాయి. సూపర్‌ మార్కెట్లతో పాటు కాలనీల్లో దుకాణాల వద్ద దాదాపు అన్ని రకాల కూరగాయల కిలో ధరలు 50- 100 వరకు ఉంటున్నాయి. 15- 20 రూపాయలు పెడితే కానీ... ఆకు కూర కట్ట కొనలేని దుస్థితి. ఎక్కువగా వినియోగించే టమాట ధరలూ మండిపోతున్నాయి.

10 రోజుల వ్యవధిలోనే..

10 రోజుల వ్యవధిలోనే టమాటా కిలో ధర రూ. 30 మేర పెరిగింది. కొన్ని చోట్ల 50కి కిలో విక్రయిస్తుండగా కొన్నిచోట్ల ఇది 60 రూపాయల వరకు ఉంటోంది. దిగుమతులు తగ్గిపోవటం ఇందుకు ప్రధాన కారణం. కొత్తపంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండేలా కన్పిస్తోంది. అంటే... అక్టోబర్‌ నెలాఖరు వరకు సామాన్యులు టమాటా కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్‌లో కిలో టమాటా రూ. 50 పైనే ఉంది. నాలుగేళ్లలో అన్‌సీజన్‌లో ఇదే అత్యధిక ధరని వ్యాపారులు చెబుతున్నారు. రోజు దాదాపు 350 మెట్రిక్‌ టన్నులకు పైగా టమాటా మదనపల్లి మార్కెట్‌కు వస్తోంది. అన్‌సీజన్‌లోనూ టమాటాకు మంచి ధర పలకడం వల్ల వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు మాత్రం ఎప్పటిలానే దళారుల చేతుల్లో మోసపోతున్నారు. బంగాళా దుంప, ఉల్లిగడ్డలు కిలో రూ. 40 నుంచి 50 వరకు పలుకుతున్నాయి. కోల్‌కతాలో రిటైల్ మార్కెట్‌లో కిలో రూ. 100 చొప్పున టమాట విక్రయాలు జరుగుతున్నాయి.

పెరుగుదల ప్రభావం..

తెలుగు రాష్ట్రాల్లోనే కాక... దేశ రాజధాని దిల్లీ, మహారాష్ట్ర, కోల్‌కతాలో ధరల పెరుగుదల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో కిలో టమాట ధరలు 100 రూపాయలకు చేరువలో ఉన్నాయి. కోల్‌కతాలో స్థానికంగా రవాణా సౌకర్యాలు లేకపోవటం, లోకల్‌ ట్రైన్‌ సేవలూ నిలిచి పోవటం వల్ల కూరగాయల రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి దిగుమతులు తగ్గిపోవటం వల్ల చండీగఢ్‌లో కూరగాయల ధరలు పెరిగాయి. భోపాల్‌లోనూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా దిల్లీలో ఈ ధరల పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోంది. ఆలుగడ్డ, టమాట, ఉల్లిగడ్డలు ప్రిమయైపోయాయి. ఆలు, ఉల్లి దాదాపు కిలో ధర 50 రూపాయలకు చేరువలో ఉంది. మరి కొన్ని నెలల పాటు దిల్లీలో ఇవే ధరలు కొనసాగే అవకాశాలున్నాయి. Spot

తగ్గిన దిగుమతులు..

హైదరాబాద్‌ నగరానికీ కూరగాయల దిగుమతులు బాగా తగ్గిపోయాయి. ధరలు పెరిగాయి. ఆగస్టులో కిలో టమాట 28 రూపాయలుగా ఉంటే...ఇప్పుడది 45 రూపాయలకు చేరుకుంది. పచ్చి మిర్చి ధర 30 నుంచి 55 రూపాయలకు పెరిగింది. రైతుబజార్లలో కాకరకాయ, బెండ, ఆలు, క్యారెట్‌ అన్నింటి ధరలూ అంతే. ఉత్తరాదిలో 15 రోజుల క్రితం పచ్చి బఠాణిల కిలో ధర 120 ఉండగా... ఇప్పుడది 150 రూపాయలకు పెరిగింది. కాలీ ఫ్లవర్‌ ధర 2 వారాల్లో 50 నుంచి 100 రూపాయలకు చేరుకుంది. ఆలుగడ్డలు కిలో ధర 10- 20 రూపాయల మేర పెరిగింది. సోయాబీన్స్‌, కీరదోస ధరలు మాత్రం కాస్తంత తగ్గాయి. సాధారణంగా ఉత్తరాది ప్రాంతాలకు హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి పచ్చి బఠాణి, టమాటాలు, కాలీఫ్లవర్‌, ఆలుగడ్డ అధిక మొత్తంలో దిగుమతి అవుతుంటాయి. కానీ.. దిగుబడులు అంతంతమాత్రంగానే ఉండటం వల్ల ఈ సారి అవి తగ్గిపోయాయి.

లఖ్‌నవూలోనూ..

లఖ్‌నవూలోనూ ఇంతే. అహ్మదాబాద్‌లో వంకాయ, దొండకాయ కిలో ధరలు 100 రూపాయలకు చేరుకున్నాయి. జమ్లాపూర్‌లోని ఏపీఎమ్‌సీ మార్కెట్‌ లాక్‌డౌన్‌ కారణంగా చాలా రోజుల పాటు తెరుచుకోలేదు. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలయ్యాక క్రయవిక్రయాలు కొనసాగినా... ఆశించిన స్థాయిలో అయితే లేవు. క్రమంగా కూరగాయల సరఫరా కూడా తగ్గిపోయింది. ఆగస్టు చివరి వారంలో భారీ వర్షాలు కురవటం వల్ల రైతులు కూరగాయల రవాణా నిలిపివేయాల్సి వచ్చింది. దాదాపు అన్ని కూరగాయల ధరలు 40-50% మేర పెరిగాయి. ప్రస్తుతానికి కొన్ని చోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టటం వల్ల కొద్ది రోజుల్లో ఈ ధరలు తగ్గే అవకాశముందని మార్కెట్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

50% మేర..

కేరళలో కూరగాయల ధరలు పెరిగిన కారణంగా..అమ్మకాలు 50% మేర తగ్గినట్టు అక్కడి వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎర్నాకులం మార్కెట్‌కు దిగుమతులు తగ్గి పోయాయి. 15 రోజుల క్రితంతో పోల్చితే ఇప్పుడు ధరలూ మరింత పెరిగాయి. అల్లం కిలో 100 రూపాయలుగా ఉండగా... టమాట దాదాపు 60 రూపాయలకు చేరువలో ఉంది. ఆలు, బీన్స్‌, క్యారెట్ సరఫరా తగ్గి గిరాకీ పెరిగింది. దేశంలో ప్రధాన మార్కెట్లన్నింటిలోనూ కాస్త అటు ఇటుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మొత్తంగా కూరగాయల బడ్జెట్‌ని అమాంతం పెంచేశాయి... ఇటీవలి పరిణామాలు.

ఇదీ చూడండి: భాజపా ఎంపీ అశోక్ గస్తి కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details