Bjp national executive meeting: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ముస్తాబైంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత జాతీయ కార్యవర్గ సమావేశాలను భాగ్యనగర వేదికగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పార్టీ కీలకనేతలు రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్షా, జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, 360మంది జాతీయ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. రాజకీయ, ఆర్థిక తీర్మానాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. సమావేశాలతోపాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జూలై3న నిర్వహించబోయే భారీ బహిరంగసభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభను ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పరిశీలించారు. భాజపా కార్యవర్గ సమావేశాలకు 18మంది ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు , జాతీయ నాయకులు హాజరవుతున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. సభ కోసం 15ప్రత్యేక రైళ్లు, వందలాది బస్సులు ఏర్పాటు చేసుకొని కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని చెప్పారు. సమావేశాలు పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల అవరోధాలు కల్పిస్తోందని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో పుత్ర వాత్సల్యంతో శివసేన ఎలా కనుమరుగైందో తెలంగాణలోనూ తెరాస అదేవిధంగా పతనం అవుతుందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ హెచ్చరించారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలు ఉట్టిపడేలా సమావేశాల ప్రాంగణం, బహిరంగసభ వేదికలను సిద్ధం చేశారు. హెచ్ఐసీసీ నోవాటెల్ ప్రాంతానికి శాతవాహన నగరంగా.. మీటింగ్ ప్రాంగణానికి కాకతీయ అని.. భోజనశాలకు భాగ్యరెడ్డి వర్మ ప్రాంగణంగా పేర్లు నిర్ణయించారు. మీడియా హాలుకు షోయబుల్లా ఖాన్, అతిథులు బస చేసే ప్రాంతానికి సమ్మక్క-సారలమ్మ నిలయంగా నామకరణం చేశారు. ప్రధాన కార్యదర్శుల సమావేశ మందిరానికి వందేమాతరం రామచంద్రరావు పేరు.. కార్యవర్గ సమావేశాల కార్యాలయానికి భక్త రామదాసుగా పేరు పెట్టారు. భాజపా సంఘటన కార్యదర్శుల సమావేశ మందిరానికి కుమురం భీం, ఎగ్జిబిషన్ స్థలానికి గొల్లకొండ పేరు, తీర్మానాల ప్రాంగణానికి నిజాంపై పోరాటం చేసిన నారాయణ పవార్ పేరు పెట్టారు. అతిథులకు స్వాగతం పలికే సమయంలో సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.