APSPDCL CMD: ఏపీసత్యసాయి జిల్లాలో.. విద్యుత్ తీగలు ఆటోమీద పడి.. ఐదుగురు సజీవదహనమైన దుర్ఘటనకు.. ఉడత కారణని చెప్పారు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు. ఈ ప్రమాదంపై స్పందించిన ఆయన.. వివరాలు వెల్లడించారు. విద్యుత్ తీగ నుంచి స్తంభంపై ఉన్న ఇనుప క్లాంప్ మీదకు ఉడత దూకడం వల్ల.. ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఉడత దూకిన సమయంలో షార్ట్‌సర్క్యూట్, ఎర్త్ కావడంతో.. హైటెన్షన్ విద్యుత్ తీగలు ఆటోపై తెగిపడ్డాయని పేర్కొన్నారు. దానివల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
సీఎండీ ఇచ్చిన ఈ వివరణపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. "తేనెటీగల వల్ల రథం తగలబడటం, ఎలుకలు మందు తాగడం, కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం, ఉడత వల్ల హై టెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ.. జగన్నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయి" అని విమర్శించారు. ఇంకా నయం.. కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పలేదని ఎద్దేవాచేశారు. ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే, కనీస విచారణ జరపకుండానే అధికారులతో కట్టుకథల కహానీలు చెప్పించారని లోకేశ్ దుయ్యబట్టారు.