తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో.... ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీచేసిన జీవోను ఏపీ హైకోర్టు (AP High-count Suspended GO) సస్పెండ్ చేసింది. తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ... ప్రభుత్వం ఇటీవల... జీవో చేసింది. ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా నిలుపుదల (AP High-count Suspended GO) చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
AP High Court On TTD: ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీచేసిన జీవో సస్పెండ్ - ap highcourt news
11:26 September 22
ప్రభుత్వ జీవోను తాత్కాలిక నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు
తితిదే బోర్డు సభ్యుల (TTD Board Members) నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారని పిటిషనర్ వాదనలు వినిపించారు. సామాన్య భక్తులపై భారం పడుతోందని పిటిషనర్లు తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
ఇటీవల నియామకం..
ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలిలో 24 మంది సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్‌లను నియమిస్తూ మరో ఉత్వర్వును జారీ చేసింది. వీరిద్దరికీ బోర్డులో ఓటింగ్ హక్కు లేనప్పటికీ, సభ్యుల్లాగే ప్రొటోకాల్ ఉంటుందని అందులో పేర్కొంది. మరోవైపు గతంలో ఎప్పుడూ లేనంతగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు భారీగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. తితిదే బోర్డు (ttd board)లో మాత్రం గతంలోలాగే మొత్తం 25 మందినే కొనసాగించేందుకే ప్రభుత్వం నిర్ణయించింది. ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy)ని ఇదివరకే నియమించినందున మిగిలిన 24 మంది సభ్యుల జాబితాను గత వారం ప్రకటించింది.
బోర్డు సభ్యుల సంఖ్యను పెంచనున్నారని కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం సాగింది. బుధవారం కూడా వైవీ సుబ్బారెడ్డి సీఎం జగన్‌ను కలిశారు. రకరకాల చర్చల తర్వాత పాత బోర్డులాగే సభ్యుల సంఖ్యను 25గానే కొనసాగించాలని నిర్ణయించారు. గత పాలకమండలిలో సభ్యులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు శ్రీనివాసన్, జూపల్లి రామేశ్వరరావు, పార్థసారథి రెడ్డిలను ఇప్పుడూ కొనసాగించారు. అలాగే వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, తెలంగాణ నుంచి మురంశెట్టి రాములు, లక్ష్మీనారాయణ తదితరులకు కూడా వరుసగా రెండోసారి అవకాశం దక్కింది. ఈసారి పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావుకు కొత్తగా అవకాశం కల్పించారు.
గత బోర్డులో సభ్యులుగా పనిచేసిన ముగ్గురు ఎమ్మెల్యేల స్థానంలో ఇప్పుడు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్‌లకు చోటు కల్పించారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు అవకాశం ఇచ్చినట్లు బుధవారం రాత్రి వరకూ అధికారిక వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే ఆయన సుముఖంగా లేకపోవడంతో ఆయన స్థానంలో సంజీవయ్యకు అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి ఒక్కో ఎమ్మెల్యేకు బోర్డులో స్థానం కల్పించారు.