ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూముల వేలాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో.. జస్టిస్ రాకేశ్‌కుమార్‌ను విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ.. ప్రభుత్వం అసత్యాలు, తప్పుడు ఆరోపణలతో అఫిడవిట్ దాఖలు చేసిందని.. ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ధిక్కార చర్యేనని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయస్థానాన్ని చులకన చేయడమేనన్న ధర్మాసనం... కోర్టు విధుల్లో జోక్యం చేసుకోవడమేనని తేల్చిచెప్పింది. అలాంటి అఫిడవిట్ దాఖలు చేసిన మిషన్ బిల్డ్-ఏపీ ప్రత్యేక అధికారి ప్రవీణ్‌కుమార్‌పై ధర్మాసనం కన్నెర్ర చేసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐఏఎస్ అధికారి తప్పుడు వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేశారని తెలిపింది. కోర్టు డాకెట్‌షీట్‌లో సహా... అనుబంధ పిటిషన్‌తో జత చేసిన దస్త్రాలు... అధికారి ఆరోపణలను బలపరిచేటట్లు లేవని స్పష్టం చేసింది. అలాంటి అఫిడవిట్ వేయడం నేరానికి పాల్పడినట్లు భావించి..... చట్టప్రకారం విచారించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో... 6 వారాల్లో సంజాయిషీ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. తప్పుడు వివరాలతో అఫిడవిట్ వేసిన ప్రవీణ్‌కుమార్‌పై... నేర విచారణ జరిపేందుకు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయాలని.... ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. ఈ వ్యాజ్యాల్లో జస్టిస్ రాకేశ్‌కుమార్‌ను విచారణ నుంచి తప్పుకోవాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి పిటిషన్లు వేయడానికి సాహసించకుండా చూడాలని పేర్కొంది. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది.