పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై... ఏపీ హైకోర్టులో రోజువారీ విచారణ కొనసాగింది. పిటిషనర్ల తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది కిషోర్‌బాబు... మూడు రాజధానులు నిర్ణయం సరికాదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధానం లేదన్నారు. సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని సెక్షన్ 3జీ ప్రకారం... రాజధాని నిర్మాణాన్ని విరమించుకున్నప్పటికీ... రైతులిచ్చిన భూములు ప్రభుత్వం వద్ద కొనసాగుతాయనటం రాజ్యాంగ విరుద్ధమని... మరో న్యాయవాది కె.ఎస్ మూర్తి వాదించారు. రాజధాని నిర్మించకుండా, భూ సేకరణ చట్టం - 2013 ప్రకారం పరిహారం చెల్లించకుండా...రైతులిచ్చిన భూమిని ప్రభుత్వం తన దగ్గర ఉంచుకోవడం... భూ ఆక్రమణలకు పాల్పడటమేనని కోర్టుకు నివేదించారు.
సీఆర్డీఏను రద్దు చేయడం... రైతుల్ని మోసగించడమే - రాజధాని అమరావతి కేసులపై హైకోర్టు విచారణ
ఏపీ రాజధానిని నిర్మించకుండా రైతులిచ్చిన భూమిని ప్రభుత్వం తన దగ్గర ఉంచుకోవటం... భూ ఆక్రమణకు పాల్పడటమేనని... అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. రైతుల ప్రాథమిక హక్కుల్ని హరించేలా చట్టాలు చేసే అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు లేదని... సీఆర్డీఏను రద్దు చేస్తూ ప్రభుత్వం చట్టం చేయటం భూములిచ్చిన రైతులను మోసగించడమేనని కోర్టుకు తెలిపారు
రాజధాని నిర్మాణం అనే భావన లేనప్పుడు రైతులు భూములివ్వడంలో అర్థమేముందని ప్రశ్నించారు. అమరావతి కోసం రైతుల నుంచి భూసమీకరణ, భూ సేకరణ పద్ధతుల్లో ప్రభుత్వం వేల ఎకరాల భూమి తీసుకుందని... భూ సేకరణ విధానంలో భూములిచ్చిన వారికి కల్పించిన ప్రయోజనాలు తరహాలోనే, సమీకరణ విధానంలో భూములిచ్చిన వారికీ కల్పించాలని వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు... రాజధాని విషయంలో ప్రజలు వద్ద నుంచి సలహాలు, సూచనలు సేకరించే క్రమంలో... తెలుగు భాషలో ప్రకటనలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది 2005లో ప్రభుత్వం ఇచ్చిన జీవోకు విరుద్ధమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలకు చట్టబద్ధత ఉండదన్నారు.
ఎమ్మెల్సీ శ్రీరామకృష్ణ తరుపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ... రాష్ట్రంలో ద్విసభ విధానం అమల్లో ఉందని, పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో శాసనమండలి అభిప్రాయాన్ని తప్పని సరిగా తీసుకోవాలన్నారు. మండలిలో బిల్లుల గురించి చర్చించలేదన్న ఆయన... మండలి నిర్ణయం లేకుండా చేసిన చట్టాలు చెల్లుబాటు కావన్నారు. పిటిషనర్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులను బిల్లులపై మాట్లాడకుండా చేయడం వారి హక్కుల్ని హరించడమేనన్నారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు ముగిశాక... వారు దాఖలు చేసిన వివిధ తీర్పులను అధ్యయనం చేసేందుకు... రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు విచారణను వారం రోజులకు వాయిదా వేయాలని కోరారు. ఆ అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం... రోజువారీ విచారణ చేపడుతున్నందున వారం రోజుల సమయం ఇవ్వలేమని స్పష్టం చేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: పవన్