ఆంధ్రప్రదేశ్, ఒడిశా తప్ప.. దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నింటిలో మెట్రో రైళ్లు ఉన్నాయి. విశాఖ, విజయవాడలతో దాదాపు సమాన జనాభా ఉన్న.. పుణె, నాగ్‌పుర్, ఇందౌర్, భోపాల్, కోచి, కాన్పుర్ వంటి నగరాలకు ఇప్పటికే మెట్రో అందుబాటులోకి వచ్చింది. శ్రీనగర్, జమ్ము, గోరఖ్‌పుర్ వంటి తృతీయశ్రేణి, అంతకంటే తక్కువ స్థాయి నగరాలూ మెట్రో ఏర్పాటుకు నడుంకట్టాయి. కొన్ని రాష్ట్రాల్లో మూడు నాలుగు నగరాల్లో మెట్రో ప్రాజెక్టులున్నాయి. వాటి విస్తరణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శరవేగంగా అడుగులు వేస్తున్నాయి. కొన్ని ప్రాజెక్టుల్ని సొంత నిధులతో, మరికొన్నింటిని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్నాయి.
విభజన చట్టం:2017 మెట్రో విధానం ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టు వ్యయాన్ని 50:50 నిష్పత్తిలో భరించేలా కొన్ని ప్రాజెక్టులు చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సాయం కోసం వచ్చిన, కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోని ప్రాజెక్టులు 18 ఉన్నాయి. దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నీ మెట్రో కోసం ఇంతగా తపిస్తుంటే.. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వానికి మాత్రం స్పందనే లేదు. విజయవాడ, విశాఖల్లో మెట్రో రైళ్ల ప్రాజెక్టులు చేపట్టాలని విభజన చట్టంలోనే ఉన్నా కేంద్రాన్ని ఏనాడూ గట్టిగా అడగలేదు. ఒక్క రూపాయి తెచ్చుకోనూ లేదు.
కేంద్రానికి ప్రతిపాదనే పంపకపోవడం: వైసీపీ ప్రభుత్వానికి మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రాధాన్యం, ఆవశ్యకతపై కనీస అవగాహన, ఆలోచన ఏ కోశానా లేవు. మెట్రో రైల్ వంటి భారీ ప్రాజెక్టుల్ని చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపన, దూరదృష్టి అంతకన్నా లేవు. విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల ప్రాజెక్టులపై కేంద్రానికి ప్రతిపాదనే పంపకపోవడం ఇందుకు నిదర్శనం. కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే, వాళ్లు ప్రాజెక్టును మంజూరు చేస్తే... రాష్ట్ర వాటాగా 50 శాతం నిధులు ఎక్కడ కట్టాల్సి వస్తుందోనన్న భయంతోనే జగన్ ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్న విమర్శలూ ఉన్నాయి. ఇలాంటి విమర్శలు ఎన్ని వచ్చినా.. ప్రజలు ఏమనుకున్నా.. ప్రభుత్వం మాత్రం చలించడం లేదు. మెట్రో రైళ్ల వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులతో రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతుంటే... ఏపీని వెనుకబడిన రాష్ట్రాలైన ఒడిశా, ఝార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల సరసన నిలిపిన ఘనత నిస్సందేహంగా జగన్ ప్రభుత్వానిదే.
హైదరాబాద్‌లో ప్రస్తుతం 72 కిలోమీటర్ల మెట్రో కారిడార్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002-03లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదనకు బీజం పడింది. వివిధ కారణాలతో ప్రాజెక్టులో జాప్యం జరిగింది. పీపీపీ విధానంలో చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టు 2017 నవంబరు 29న అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడది హైదరాబాద్‌కు మణిహారంలా భాసిల్లుతోంది. రెండు దశాబ్దాల క్రితమే.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్‌కు ఎంఎంటీఎస్ వచ్చింది.