AP CM JAGAN MET PM MODI : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయని ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ వివరించారు. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద చెల్లించాల్సిన బకాయిలు రూ.18 వేల330 కోట్లు, 10వ వేతన సంఘం బకాయిలు, పింఛన్లు కలిపి మొత్తం 32 వేల 625 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు కేంద్రం నుంచి అందాల్సి ఉందన్నారు. వీటిని వెంటనే మంజూరు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
పెండింగ్ బకాయిలు: గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా చేసిన రుణాలను, కేంద్ర ఆర్థిక శాఖ ఈ ప్రభుత్వంలో సర్దుబాటు చేస్తూ రుణాలపై పరిమితి విధిస్తోందని.. కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆంక్షలు రాష్ట్రాన్ని బాగా దెబ్బతీశాయని.. అందుకనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. పోలవరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2 వేల 937 కోట్లు చెల్లించాలని కోరారు. అలాగే ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు పెంచిన అంచనాల మొత్తం 55 వేల 548 కోట్లకు ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీని డీబీటీ ద్వారా చెల్లించాలని కోరారు. మిగిలన పనులు పూర్తి చేసేందుకు రూ.10 వేల485 కోట్లు ఇవ్వాలని కోరారు.