CM JAGAN BIRTHDAY CELEBRATIONS : ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు వైకాపా నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్‌ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు జగన్‌కు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు సీఎంను కలసి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా సీఎంకు తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదాలను తితిదే ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు సీఎంకు అందించారు. పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పాస్టర్ జాన్ వెస్లీ.. ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. తర్వాత సీఎం జగన్ కేక్ కట్ చేశారు.
ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త దానం చేశారు. కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనకాపల్లిలో మంత్రి గిడివాడ అమర్నాథ్ రక్తదానం చేశారు. శ్రీకాకుళం మంత్రి ధర్మాన జగన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి తర్వాత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కేక్ కట్‌చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
సచివాలయంలో పుట్టినరోజు సంబరాలు: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ, ఎక్సైజ్ శాఖ కమిషనర్ వివేక్ యాదవ్, A.B.C.L MD వాసుదేవరెడ్డి తదితరులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అటు ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు నాగిరెడ్డి తదితరులు సచివాలయంలోని తమ ఛాంబర్లలో సీఎం పుట్టిన రోజు వేడుకల్ని నిర్వహించారు. కేక్ లు కట్ చేసి ఉద్యోగులకు పంచిపెట్టారు. ఈసారి సాంస్కృతిక శాఖే అధికారికంగా మాసోత్సవాలు నిర్వహించటంతో సచివాలయంలోనూ వివిధ ప్రభుత్వ శాఖలు కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నాయి.
ఇవీ చదవండి: