తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఉభయ రాష్ట్రాల అంగీకారం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరిలో నీటి వాటాను తేల్చేందుకు గోదావరి ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇందుకోసం తమ ప్రతిపాదనలు పంపాల్సిందిగా రెండు రాష్ట్రాలను కేంద్ర జల్‌శక్తి మంత్రి కోరారు. ఈ విషయంలో జల్‌శక్తి మంత్రిత్వశాఖ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదన పంపుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ తెలుగు రాష్ట్రాలకు పంపిన అపెక్స్‌ కౌన్సిల్‌ మినిట్స్‌లో పేర్కొంది.

By

Published : Oct 24, 2020, 6:54 AM IST

ap and telangana
ap and telangana

గోదావరిలో నీటి వాటాను తేల్చేందుకు గోదావరి ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. ఇందుకోసం తమ ప్రతిపాదనలు పంపాల్సిందిగా రెండు రాష్ట్రాలను కేంద్ర జల్‌శక్తి మంత్రి కోరారు. ఈ విషయంలో జల్‌శక్తి మంత్రిత్వశాఖ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదన పంపుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ తెలుగు రాష్ట్రాలకు పంపిన అపెక్స్‌ కౌన్సిల్‌ మినిట్స్‌లో పేర్కొంది.

సెక్షన్‌-3 ప్రకారం

అంతర్‌ రాష్ట్ర జల వివాద చట్టం-1956లోని సెక్షన్‌-3 ప్రకారం ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ వినతిని పరిగణనలోకి తీసుకోవాలంటే ఈ అంశంపై తెలంగాణ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకోవాలి. ఈ మేరకు హామీ వచ్చిన తర్వాత కేంద్రం కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలా లేక ప్రస్తుతం ఉన్న కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-2కే అప్పగించాలా అన్నదానిపై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటుంది. సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి అంగీకరించారని మినిట్స్‌లో కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రి ఛైర్మన్‌గా, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా గల అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఈ నెల 6వ తేదీన జరిగింది. సమావేశంలో చర్చించిన.. తీసుకొన్న నిర్ణయాలకు సంబంధించిన 12 పేజీల మినిట్స్‌ రెండు రాష్ట్రాలకు చేరాయి.

అపెక్స్‌ సమావేశంలో నిర్ణయాలు, వ్యక్తమైన అభిప్రాయాలు ఇలా...

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి: దీనిని కేంద్రం నోటిఫై చేస్తుంది. ఇది తనకు అంగీకారం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014 ప్రకారం నోటిఫికేషన్‌ ఇచ్చే అంశం కేంద్రానికి సంబంధించినదని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ మేరకు నోటిఫై చేయనున్నట్లు తెలిపారు.

డీపీఆర్‌లు:అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం కోసం కొత్త ప్రాజెక్టులకు సంబంధించి వెంటనే రెండు రాష్ట్రాలూ బోర్డులకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్‌) సమర్పించాలి. వీలైనంత తక్కువ సమయంలో పరిశీలన పూర్తి చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. డీపీఆర్‌లు అందచేయడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అంగీకరించారు.

కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాల మార్పు: రెండు రాష్ట్రాలూ అంగీకరించాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్‌కు మార్చుతారు.

కాళేశ్వరంలో మొదటి నుంచీ మూడు టీఎంసీలకు ప్రణాళిక: కేసీఆర్‌

తెలంగాణ ఏర్పడిన ఏడేళ్ల తర్వాత కూడా న్యాయ సమ్మతంగా మా నీటి వాటాపై ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రస్తుతం నీటి వినియోగానికి సంబంధించి ఒక ఏర్పాటు మాత్రమే ఉంది. అంతర్‌ రాష్ట్ర జల వివాదచట్టం-1956లోని సెక్షన్‌(3) ప్రకారం ట్రైబ్యునల్‌ ఏర్పాటై నీటి వాటాను ఖరారు చేసే వరకు బోర్డుల పరిధి అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. ట్రైబ్యునల్‌ అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున పరిధి అంశం గురించి చర్చించరాదు. గోదావరి ఎత్తిపోతల పథకం 20 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. దీనిపై రూ.ఆరువేల కోట్లు ఖర్చు పెట్టారు. కేంద్రం కూడా దీనికి నిధులిచ్చింది. దీన్ని కొత్త ప్రాజెక్టు అనకూడదు. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి నుంచి మూడు టీఎంసీలకు ప్రణాళిక ఉంది. కొత్తగా చేపట్టింది కాలువల నిర్మాణమే. గోదావరిలో ఆంధ్రప్రదేశ్‌కు ఏమైనా అభ్యంతరం ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. దాన్ని ట్రైబ్యునల్‌కు పంపాలి. 1,500 క్యూసెక్కులతో డిజైన్‌ చేసిన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని క్రమంగా 84వేల క్యూసెక్కులకు పెంచుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఇలా మళ్లించేది కృష్ణాబేసిన్‌ బయటకు. బేసిన్‌లోని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవు. ఆంధ్రప్రదేశ్‌ కొత్త ప్రాజెక్టును కొనసాగిస్తే తెలంగాణ రోజుకు మూడు టీఎంసీల నీటిని మళ్లించేలా అలంపూర్‌ దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తుంది. వీటన్నిటికీ పరిష్కారం సెక్షన్‌(3) ప్రకారం ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయడమే.

రాయలసీమ ఎత్తిపోతల నీటిని తీసుకెళ్లడానికి కాదు: ఏపీ సీఎం జగన్‌

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండలాగానే రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తాగు, సాగునీటి అవసరాలకు శ్రీశైలం మీద ఆధారపడి ఉన్నాయి. కేటాయించిన నీటి కంటే ఎక్కువ తీసుకెళ్లడానికి రాయలసీమ ఎత్తిపోతల చేపట్టలేదు. అదనపు నిల్వకానీ, అదనపు ఆయకట్టు కానీ దీని కింద లేదు. తెలంగాణ.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్నీ పెంచుతోంది. గోదావరిలో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులపై దీని ప్రభావం పడుతుంది. డీపీఆర్‌లు అందజేసి గోదావరి బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లభించేవరకు ప్రాజెక్టుల నిర్మాణంపై ముందుకెళ్లొద్దని తెలంగాణ ప్రభుత్వానికి సూచించాలి. గోదావరిలో పరస్పర ఒప్పందం లేదా ట్రైబ్యునల్‌కు అప్పగించడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరగాలి.

ఇదీ చూడండి:రెండో రోజు కేంద్రబృందం పర్యటన.. నష్టం అంచనా వివరాలు సేకరణ

ABOUT THE AUTHOR

...view details