స్వచ్ఛ సర్వేక్షన్-2020 సర్వేలో శుభ్రత, పరిశుభ్రత అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరోస్థానంలో నిలిచింది. ప్రధాని, కేంద్ర గృహ పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి నేతృత్వంలో వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా... 2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి మధ్యకాలానికి అవార్డులు ప్రకటించారు. శుభ్రత, పరిశుభ్రతకు సంబంధించి... విజయవాడ, తిరుపతి, విశాఖ, చీరాల, ఆత్మకూరు, పలమనేరు, ముమ్మిడివరం నగరాలు పలు విభాగాల్లో అవార్డులు సాధించాయి. జాతీయ స్థాయిలో 10 లక్షలు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో నాలుగో ర్యాంకు సాధించిన విజయవాడ... 10 నుంచి 40 లక్షల జనాభా కలిగిన నగరాల్లో అతి పెద్ద శుభ్రమైన నగరంగా అవార్డు సాధించింది. 10 లక్షలు పైబడిన జనాభా ఉన్న నగరాల జాబితాలో విశాఖ తొమ్మిదో ర్యాంకు సాధించింది. లక్ష నుంచి 3లక్షలు జనాభా కేటగిరీలో తిరుపతి దేశంలోనే సుస్థిరాభివృద్ధి కలిగిన చిన్న నగరంగా మొదటి ర్యాంకు సాధించింది. 10 లక్షలు జనాభా ఉన్న నగరాల్లో తిరుపతి ఆరో స్థానంలో నిలిచింది.
చీరాల మొదటి స్థానంలో...
50 వేల నుంచి లక్ష జనాభా కలిగిన సుస్థిరాభివృద్ధి ఉన్న చిన్న పట్టణంగా చీరాల దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 25 వేల నుంచి 50 వేల జనాభా కలిగిన ఉత్తమ సుస్థిరాభివృద్ధిగల చిన్న పట్టణంగా ఆత్మకూరు కూడా దేశంలోనే మొదటి ర్యాంకు సాధించింది. 25 వేల లోపు జనాభా కలిగి, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా ముమ్మిడివరం నిలిచింది. దక్షిణ జోన్‌లో 50 వేల నుంచి లక్ష జనాభా కలిగిన ఉత్తమ శుభ్రమైన పట్టణంగా పలమనేరు నిలిచింది. విజయవాడ నగరానికి అవార్డు రావటం వెనుక పారిశుద్ధ్య సిబ్బంది, అధికారుల సమష్ఠి కృషి ఉందని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ అన్నారు.