ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ఓళిగ అంటే రాయలసీమ జిల్లాలో తెలియని వారండురు. పండగ రోజుల్లో పూర్ణం ఓళిగకు బాగా గిరాకీ ఉంటుంది. వివాహ తదితర శుభకార్యాలకు పూర్ణం ఓళిగకు ప్రాధాన్యత ఇస్తారు. అతిథులకు మరిన్ని రుచుల్లో ఓళిగల విందు పెట్టాలనుకునే వారు కొబ్బరి, డ్రైఫ్రూట్ తదితర వాటిని ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయిస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి బంధువుల ఇంటికి, పొరుగు ఊర్లకు వెళ్లే వారు పూలు, పండ్లతో పాటు ఓళిగలను తీసుకెళ్లటం ఆనవాయితీ. ఈ మధ్య ఆన్లైన్లోనూ ఓళిగ విక్రయాలు పంజుకున్నాయి.
అనంతపురం జిల్లాలో దాదాపు 250 ఓళిగ తయారీ కేంద్రాలున్నాయి. వీటి నిర్వహకులతోపాటు 1,000 మంది వరకు దుకాణాల్లో రోజువారీ కార్మికులుగా పనిచేస్తున్నారు. అనంత నగరంలోనే 70 వరకు ఓళిగ తయారీ కేంద్రాలున్నాయి. కదిరి, హిందూపురం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ధర్మవరం తదిర ప్రాంతాల్లో రోజూ వేలాదిగా ఓళిగ విక్రయాలు జరుగుతుంటాయి. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే జిల్లా నుంచి రోజూ 70 వేల నుంచి లక్ష ఓళిగలు హైదరాబాద్, బెంగుళూరు నగరాలకు పంపుతుంటారు. ఈ ఓళిగలు అమెరికాకు తీసుకెళ్లాలంటే పది రోజులపాటు చెడిపోని విధంగా ప్రత్యేకంగా తయారు చేసి ఇస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఓళిగ కుటీర పరిశ్రమ లాక్ డౌన్ తో కొంత నష్టపోయింది. దసరా పండగతో పరిశ్రమ మళ్లీ పుంజుకుంది.