ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో.. కరోనా రోగుల కోసం ఆనందయ్య రూపొందించిన ఔషధం దేశంలోనే హాట్ టాపిక్‌గా మారింది. మందు కోసం వేలాది మంది ఎగబడ్డారు. భారీగా జనం తరలివెళ్లారు. రద్దీని అదుపు చేసేందుకు.. కొవిడ్ వ్యాప్తి, ఆనందయ్య మందుపై పరిశోధనల పేరుతో పంపిణీని ఆపివేశారు. అప్పటి నుంచి ఆనందయ్య ఔషధం పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. అయితే అనుమతుల మాట ఎలా ఉన్నా మందును అనధికారికంగా తయారు చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో రహస్యంగా.. ఆనందయ్య స్వయంగా మందు తయారు చేస్తున్నారని కొందరు చెబుతున్నారు.'
శిష్య బృందంతో కలిసి
కృష్ణపట్నంలో ఆనందయ్య గత కొన్ని నెలలుగా.. కరోనా బాధితుల కోసం మందును తయారుచేస్తున్నారు. ఆయన వద్ద వైద్యం నేర్చుకున్న 20 మంది శిష్య బృందం సైతం మరో ప్రాంతంలో మందును తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్, కృష్ణపట్నం, చిల్లకూరు పరిసర ప్రాంతాలతో పాటు మరికొన్నిచోట్ల.. రహస్యంగా తయారు చేస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధులకు మందును పంపిణి చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.